త్వరలో తాను తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత చరిత్రను బయోపిక్‌గా తీస్తానని, ఆ చిత్రంలో తన తండ్రి పాత్రను తానే చేస్తానని ప్రకటించిన బాలయ్య, ఈ చిత్రాన్ని ఎక్కడ ప్రారంభించాలో? ఎక్కడ ముగించాలో తనకు తెలుసునని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ చిత్రం ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. కాగా ఎన్టీఆర్ బయోపిక్‌ను ఆయన సినీ స్టార్ నుండి టిడిపి పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రి అయ్యేవరకు మాత్రమే చూపిస్తారనే టాక్ మొదలైంది. ఆపైన కూడా చూపిస్తే పలు వివాదాలను గెలికినట్లవుతుందని, అది స్వయాన తనకు, చంద్రబాబుకు అందరికీ సమస్యగా మారుతుందని బాలయ్య ఓ నిర్ణయానికి వచ్చాడంటున్నారు.
ఈ విషయంపై ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్ నుంచి బాబు పదవిని లాక్కొని, ఆయన్ను పదవీక్షితుడిని చేసి, అవమానించిన అంశాలను, ప్రజలకు తెలియాల్సిన అంశాలను చూపకపోతే అది ఎన్టీఆర్ బయోపిక్ ఎలా అవుతుందని, బాలయ్య చరిత్రను వక్రీకరించినట్లేనని ఆమె మండిపడ్డారు. తనను బూచిగా చూపించి, చంద్రబాబు, రామోజీరావులు అందరినీ తప్పు దోవ పట్టించారని, తమ తండ్రి చివరి రోజుల్లో ఆయనకు సహకరించకుండా ప్రవర్తించిన ఆయన కుటుంబసభ్యులు ఇప్పుడు పదవుల కోసం రోడ్లు తిరుగుతున్నారని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఇక ఈ చిత్రంలో మిమ్మల్ని విలన్‌గా చూపించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు ఆమె తాను విలన్‌ను కాదని, తాను ఎన్టీఆర్ జీవితంలోని దేవతనని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్, వాళ్ల అమ్మను దూరంగా పెట్టినప్పుడు తాను చేరదీశానని జూనియర్ స్కూల్ నుంచి రాగానే తన వద్దకు పరుగెత్తుకొని వచ్చేవాడని, కానీ ఆయన ప్రస్తుతం తాను చేసిన మంచిని మరిచిపోయాడని.. కాబట్టే తాను జూనియర్‌ను అహంభావిగా పేర్కొన్నానని తెలిపింది. లక్ష్మీపార్వతి కామెంట్స్ ప్రస్తుతం మరలా చర్చనీయాంశం అయ్యాయి.