సినిమా ప్రారంభమైన తర్వాత, ఇటీవల వరకు రానా నటిస్తున్న 'ఘాజీ' చిత్రంపై ఎవ్వరికీ ప్రత్యేక అంచనాలు లేవు. సంకల్ప్‌రెడ్డి అనే ఓ కొత్తకుర్రాడు దర్శకత్వం వహిస్తుండగా, హీరోగా పెద్ద క్రేజ్‌లేని రానా, తాప్సి వంటి వారు నటిస్తుండటంతో దీనిని ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ ఈ చిత్రం టీజర్ రిలీజ్ నుంచి మాత్రం అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో కరణ్‌జోహార్ రిలీజ్ చేయనుండటం, తాజా ప్రమోషన్లతో ఈ చిత్రంపై ఇప్పుడిప్పుడు భారీ అంచనాలు మొదలవుతున్నాయి. ఇవి సినిమా రిలీజ్ నాటికి మరింతగా పెరగడం ఖాయం. రాజమౌళి, అమితాబ్‌ల నుంచి పలువురి మద్దతుతో ఈ చిత్రం గణనీయంగా హైప్ పెంచుకుంటూ వస్తోంది.
కాగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి17న రిలీజ్ చేస్తామని మొదటి నుంచే చెబుతూ వస్తున్నారు. అయినా కూడా ఈ చిత్రాన్ని పెద్దగా లెక్కలోకి తీసుకోకుండా రాజ్‌తరుణ్ హీరోగా నటిస్తున్న 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త', మంచు మనోజ్ నటించిన 'గుంటూరోడు', నిఖిల్ నటిస్తున్న 'కేశవ' చిత్రాలను కూడా అదే తేదీన విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. కానీ రోజు రోజుకు 'ఘాజీ'కి పెరుగుతున్న అంచనాలను చూసిన ఈ మూడు చిత్రాల దర్శకనిర్మాతలు, హీరోలు పోయి పోయి ఈ చిత్రంతో పోటీ ఎందుకులే అని భావించినట్లున్నారు. దాంతో తమ చిత్రాల విడుదల తేదీలను అఫీషియల్‌గా ప్రకటించకుండా, మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇక ఈ చిత్రాలు ఏవీ ఆరోజున విడుదలయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో 'ఘాజీ' ఈనెల 17న సోలోగా రావడం ఖాయమేనంటున్నాయి సినీ వర్గాలు.