మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. గత ఏడాది ఈయన నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఆ చిత్రాలను ఇటు తెలుగులో డబ్ చేసి ఇక్కడా హిట్ కొట్టాడు. ఆ ఊపులోనే మోహన్ లాల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ని కూడా మొదలు పెట్టేస్తున్నాడు. అసలు ఆయన డైరెక్ట్ గా నటించిన తెలుగు చిత్రాలు 'జనతా గ్యారేజ్, మనమంతా' కూడా ఇక్కడ హిట్ అయ్యాయి. అందుకే మోహన్ లాల్ తాను నటించే ప్రతి సినిమాని తెలుగులో డబ్ చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. అయితే ఇప్పుడు తాను బి. ఉన్నికృష్ణన్ డైరెక్షన్లో చేస్తున్న ప్రాజెక్ట్ లో టాలీవుడ్ నుండి విలన్ గా చెయ్యడానికి ఇప్పటికే శ్రీకాంత్ ని సెలెక్ట్ చేసుకున్న మోహన్ లాల్ ఇప్పుడు మరో టాలీవుడ్ హీరోయిన్ కి అవకాశం ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి.
తెలుగులో వరుసబెట్టి స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తున్న రాశి ఖన్నా కి మోహన్ లాల్ తన చిత్రంలో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రని ఇచ్చినట్లు వార్తలొస్తున్నాయి. ఇకపోతే మోహన్ లాల్ తమిళ్ యాక్టర్స్ ని కూడా తన సినిమా కోసం ఎంచుకున్నాడట. టాలీవుడ్ నుండి శ్రీకాంత్ ని ఒక విలన్ గా సెలెక్ట్ చేసిన మోహన్ లాల్ కోలీవుడ్ నుండి మరో విలన్ గా హీరో విశాల్ ని ఎంపిక చేసాడట. మరి తెలుగు, తమిళ హీరోలను విలన్స్ గా ఎంపిక చేసి ఆశ్చర్య పరిచిన మోహన్ లాల్ తమిళం నుండి హీరోయిన్ హన్సిక ని కూడా ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసాడట.
ఇక టాలీవుడ్ నుండి, కోలీవుడ్ నుండి స్టార్స్ ని ఎంపిక చేసి ఈ చిత్రంపై భారీ అంచనాలు మోహన్ లాల్ పెరిగేలా చేసాడని... ఇక ఈ రెండు భాషల్లో కూడా తన చిత్రాన్ని రీమేక్ చెయ్యకుండా డైరెక్ట్ గా డబ్ చేసే ఉద్దేశ్యంతోనే మోహన్ లాల్ ఇలా చేసాడని అంటున్నారు. అయితే మళయాళంతోపాటే తెలుగు, తమిళంలో తన చిత్రాన్ని డైరెక్టుగా రిలీజ్ చేస్తాడా? లేదా? అనేదానిమీద ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.