ఒకప్పుడు మా చిత్రం ఇంత వసూలు చేసింది... ఇన్ని సెంటర్స్‌లో శతదినోత్సవం జరుపుకుంది... ఇన్ని సెంటర్లలో అర్దశతదినోత్సవం జరుపుకుంది.. అని నిర్మాతలే దొంగ కలెక్షన్లు, సెంటర్స్ చూపిస్తూ, ప్రకటనను ఇచ్చేవారు. వాటిని చూసిన ఆయా హీరోల అభిమానులు వాటినే నిజమని నమ్మి, ఇతరులతో వాదనలు, పందేలు కట్టేవారు. ఇప్పుడు ప్రకటనలు కాకుండా ఏకంగా మీడియా సమావేశాలే పెట్టి తమ చిత్రాల కలెక్షన్లు చెబుతున్నారు. కానీ వీటిని వారి అభిమానులు నమ్మవచ్చేమోగానీ సినిమా పరిజ్ఞానం, కాస్త వివేకంతో ఆలోచించే వారెవ్వరూ నమ్మడం లేదు. ప్రస్తుతం మన చిత్రాలు ఓవర్‌సీస్‌లో కూడా బాగా ఆడుతున్నాయి. యూఎస్ వంటివి మనకి మంచి ఆదాయ వనరుగా మారుతున్నాయి.
అక్కడ టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తారు కాబట్టి అక్కడి కలెక్షన్లు విషయంలో ఎవ్వరూ తప్పులు ఎత్తిచూపలేకపోతున్నారు. కానీ మనదేశంలో కేవలం నగరాలు, మహానగరాలలోని మల్టీప్లెక్స్‌లు మినహా సింగిల్ థియేటర్లలో ఇప్పటికీ టిక్కెట్ల కౌంటర్ల ద్వారానే టిక్కెట్లు విక్రయిస్తున్నారు. వీటిలో మొదటి వారం ఆయా హీరోల రేంజ్‌ను బట్టి థియేటర్ వారే బ్లాక్‌లో అమ్మిస్తున్నారు. వారు బాగానే సంపాదిస్తూ ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు తక్కువ ఆదాయాలను నిర్మాతలకు, ప్రభుత్వానికి చూపుతున్నారు.
మరోపక్క వచ్చిన ఆదాయం కంటే ఎగ్జిబిటర్లు కలెక్షన్లను తక్కువగా చూపుతుంటే ఆయా చిత్రాల నిర్మాతలు మాత్రం తమ చిత్రాల కలెక్షన్లను పెంచిచెబుతున్నారు. దీంతో అభిమానులు కొట్లాటలకు దిగుతున్నారు. మనదేశంలో కూడా 100శాతం టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అమ్మేరోజులు దగ్గరలోనే ఉన్నాయి. విదేశాలలోని రన్‌ట్రాక్ విధానం మన దేశంలో.... రాష్ట్రంలో కూడా వచ్చే రెండు మూడేళ్లలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆన్‌లైన్ విక్రయాలను థియేటర్ల ఓనర్లు తమ స్వార్థం కోసం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలా దొంగ కలెక్షన్లు, సెంటర్లు చెప్పడంలో ఎవ్వరూ తక్కువ కాదు... అందరూ అందరే.. నిజంగా కలెక్షన్లు ఎలా ఉన్నాయి? అనే విషయం ప్రతి ఒక్కరి మనస్సును నిజాయితీగా ప్రశ్నిస్తే అర్ధమవుతుంది. కాబట్టి ఇలాంటి వేషాలు వేసే నిర్మాతల నిజాలు బద్దలయ్యే వరకు ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి..!