పోసానితో మాట్లాడిన ఎవ్వరికైనా ఒక్క విషయం అర్ధమవుతుంది. ఆయనలో నిజాయితీ, తపన, ఆవేశం వంటివి ఉన్నాయేగానీ... ఆయన మాటల్లో ఎక్కువగా ఆత్మస్తుతి... పరనింద ఉంటాయి. తనను తాను సత్యశీలుడిని అని చెప్పుకోవడంలో తప్పులేదు గానీ.. పక్క వారందరూ, వినేవారు వెధవలునుకుంటాడు. తాజాగా ఆయన టివి9లో ఇచ్చిన ముఖాముఖి కార్యక్రమంలో జాఫర్ వేసిన ప్రశ్నలకు తలాతోకా లేకుండా వాదించాడు. తన విషయానికి వస్తే తాను వి.హన్మంతరావుని తిట్టడం, పరుచూరి తదితరుల మీద సెటైర్లు వేయడం, కొరటాల శివను విమర్శించడం, టిడిపికి మరీ ముఖ్యంగా చంద్రబాబునాయుడును సపోర్ట్ చేస్తూ పత్రికల్లో పూర్తి పేజీప్రకటనలను వంటివి చేశాడు.
ఇక ఆ తర్వాత చిరంజీవి పిఆర్‌పీ పార్టీ తరపున చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత చిరంజీవిని తిట్టాడు. వైఎస్‌జగన్ పంచన చేరి, భజన చేశాడు. ఆ తర్వాత ఆయన్ను కూడా తిట్టి నరేంద్రమోదీకి ప్రస్తుతం సపోర్ట్ చేస్తున్నాడు. మరి ఇన్ని స్టాండ్స్ తీసుకున్న పోసాని పవన్ గురించి మాట్లాడుతూ, పవన్ మోదీని అప్పుడెందుకు సపోర్ట్ చేశాడు? ఇప్పుడెందుకు విమర్శిస్తున్నాడు? అంటూ విమర్శలు చేశాడు. మరి మీ సంగతి ఏంటి? అని అడిగితే తనను తాను డిఫెండ్ చేసుకోవడంలో పడిపోయాడు. నోటికొచ్చిన బూతులు మాట్లాడాడు. వాటిని చానెల్ వారు మ్యూట్ చేయాల్సివచ్చింది. ఇక తాను ఎందరినో విమర్శించిన విషయాన్ని ఆయన మర్చిపోయి యండమూరి రామ్‌చరణ్ గురించి కామెంట్ చేయడంపై యండమూరిపై విరుచుకుపడ్డాడు.
చిరు, నాగబాబు. పవన్‌లు మంచోళ్లు కాబట్టి యండమూరిని వదిలేశారని, అదే నేనైతేనా.. అని బూతులు ఎత్తుకున్నాడు. ఇక్కడ యండమూరి చేసింది తప్పా? రైటా? అనేది ఎవరి కోణంలో వారు ఆలోచిస్తున్నారు. యండమూరి తాను వ్యక్తిత్వవికాసంలో భాగంగా రాసిన 'విజయానికి ఐదు మెట్లు'తో పాటు పలు పుస్తకాలలో తనపై తాను, తన ఫ్యామిలీపై విమర్శలు, వ్యాఖ్యానాలు, సెటైర్లు కూడా ఉంటాయి అనేది పోసాని మర్చిపోయాడు. ఇక వర్మ విషయానికి వస్తే వర్మ వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయడని, ఆయన ట్రంప్ నుంచి అందరినీ సమయం బట్టి, వాళ్లు తీసుకునే నిర్ణయాలను మాత్రమే విమర్శిస్తాడన్న ఒక్క మాటను తప్పితే ఈ ఇంటర్వ్యూలో పోసాని స్పందన కేవలం వార్తల్లో నిలబడేందుకు, తనను తాను గొప్పగా ఆవిష్కరించుకుని భజన చేసుకోవడం, ప్రశ్నలకు అడ్డదిడ్డంగా సమాధానం ఇవ్వడం, పొంతన లేని విషయాలను ప్రస్తావించడం కంటే ఆయన ఏమీ చేయలేదన్నది వాస్తవం.