శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, అక్షయ్‌కుమార్‌లు నటిస్తున్న '2.0' షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. చెన్నై, మహాబలిపురంల సమీపంలో వేసిన ఓ భారీ సెట్‌లో ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది. మరోపక్క ఈ చిత్రం బడ్జెట్‌ను 350 కోట్లు అని ప్రచారం చేస్తే, తాజాగా అది 500కోట్లు అయ్యేలా ఉందని కోలీవుడ్ మీడియా వార్తలు వండుతోంది. దాంతో ఈ చిత్రమే దేశచరిత్రలో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న చిత్రంగా ప్రచారం చేస్తున్నారు. ఏప్రిల్14న నూతన తమిళ ఏడాది ప్రారంభం సందర్బంగా ఈ చిత్రం ట్రైలర్‌ను, దీపావళికి చిత్రాన్ని విడుదల చేయాలని వారు ప్లాన్ చేస్తున్నారు.
కాగా వాస్తవానికి ఈ చిత్రానికి 'రోబో2' అనే టైటిల్‌ను పెట్టాలని భావించారట. తమిళంలో 'యంతిరన్2'గా విడుదల చేయాలనుకున్నప్పటికీ ఈ రెండు టైటిల్స్‌ను సన్‌నెట్‌వర్క్ అధినేత మారన్ రిజిష్టర్ చేసి ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే దీనికి '2.0' అనే టైటిల్‌ను ఎంచుకున్నారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ టైటిల్ కోసం మారన్‌ను సంప్రదిస్తే ఆయన ఏకంగా టైటిల్‌కే కోట్లను డిమాండ్ చేయడంతో చివరికి దర్శకనిర్మాతలు ఈ నిర్ణయానికి వచ్చారంటున్నారు.
ఇక ఈ చిత్రం బడ్జెటే 500కోట్లు అయితే ఇక ఈ చిత్రం రైట్స్‌ను ఎంతకు అమ్మాలి? లాభాలు రావాలంటే ఎంత కలెక్షన్లు వసూలు చేయాలి? అనేది అర్ధం కాక ట్రేడ్ పండితులు తలలు పట్టుకుంటున్నారు. కానీ ఈ చిత్రానికి అన్ని భాషల్లో క్రేజ్ ఉండటంతో పాటు అక్షయ్‌కుమార్ పుణ్యమా అని బాలీవుడ్‌లో కూడా 'రోబో'కి పదింతలు క్రేజ్ రావడంతో ఇదేమీ పెద్ద విషయం కాదని నిర్మాతలు నిశ్చింతగా ఉన్నారంటున్నారు. ఈ చిత్రం తెలుగు రైట్స్ కోసం బెల్లకొండా సురేష్, 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డిలు పోటీపడుతున్నారు. వీరిద్దరు మంచి స్నేహితులే కనుక ఈ చిత్రానికి ఇద్దరు భాగస్వాములుగా వ్యవహరించినా ఆశ్యర్యపోవాల్సిన పనిలేదు.