పవన్‌కళ్యాణ్ ఇంకా తన జనసేన పార్టీని సంస్థాగతం కూడా బలోపేతం చేయలేదు. కావాలంటే కమిటీలను, మెంబర్లను కేవలం 10 రోజుల్లో వేయగలనని, కానీ తాను తొందరపడదలుచుకోలేదని ఆయన ఎప్పుడో స్పష్టం చేశారు. ఎప్పటి నుంచో వారసత్వాలుగా వస్తోన్న టిడిపి, వైసీపీలను ఢీకొనే బలం కూడా తన వద్ద లేదని ఆయన గతంలోనే వినమ్రతగా సెలవిచ్చాడు. ఇక ఇటీవల జరిగిన అమెరికా పర్యటనలో కూడా తన భావాలు నచ్చే యువత, ఎన్నారైల తోడ్పాటు తనకు కావాలని పిలుపునిచ్చాడు. మీలాంటి యువతరం నాయకుల కోసం తాను ఎదురుచూస్తున్నానని తెలిపాడు. తన పార్టీకి ఇప్పుడు విరాళాలు వద్దని విన్నవించాడు. తనది ప్రతిది పారదర్శకంగా ఉండాలనుకునే మనస్తత్వమని చెప్పాడు.
కాగా రాబోయే ఎన్నికల్లో ఆయన ఆమ్‌ఆద్మీ, లోక్‌సత్తా, వామపక్షాల వంటి వారి మద్దతు తీసుకునే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు ఓ అంచనాకు వస్తున్నారు. 2019 ఎన్నికల కోసం ఆయన ఇప్పటి నుండో ఏయే నియోజకవర్గాల్లో పోటీ చేయాలి? ఎవరిని బరిలోకి దించాలని కూడా అన్వేషణ సాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొందరైతే వచ్చే 2019 ఎన్నికల్లో పవన్ జనసేన పార్టీ తరపున ఎక్కడి నుండి పోటీ చేయాలనుకుంటున్నాడో కూడా వార్తలుగా రాసి వండివారుస్తున్నాయి. వీటిపై ఎవ్వరికీ సరిగా సమాచారం లేదు. కానీ తాజాగా వస్తున్న వార్తల ప్రకారం పవన్ ఇప్పటికే ఏలూరు నుండి ఓటర్‌గా తన పేరు నమోదు చేసుకొన్నాడు.
దాంతో ఆయన ఏలూరు లేదా తాడేపల్లిగూడెంల నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు. పవన్‌కి అభిమానులతో పాటు ఆయన సామాజిక వర్గానికి ఎక్కువ ఓట్లున్న తాడేపల్లి గూడెం నుంచి పోటీ చేస్తే పవన్ విజయం నల్లేరు మీద నడకేనని ప్రచారం మొదలైంది. కాగా కిందటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి బిజెపినేత, మంత్రి మాణిక్యాలరావు గెలిచారు. ప్రస్తుతం పవన్ మీద వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా చేసిన వారిలో మంత్రి మాణిక్యాలరావు కూడా ముందున్నాడు. ఇక పవన్ టార్గెట్ కూడా బిజెపి కావడంతో వచ్చే ఎన్నికల్లో ఆయన మాణిక్యాలరావును ఢీకొని, ఆయన్ను ఓడించడానికి రెడీ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. కానీ వీటిలో నిజమెంతో తెలియదు గానీ.. ఈ విషయం మాత్రం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.