రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన పళని స్వామి గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో తన బల పరీక్ష నెగ్గాడు. ఎట్టకేలకు ఉత్కంఠతకు తెర తీసి జైళ్ళో కూర్చొన్న చిన్నమ్మ ఎలాంటి స్కెచ్ అయితే చేసిందో యథావిధిగా అలాంటి పరీక్షకు అనుగుణమైన రాతలతో స్వామి అసెంబ్లీలో చేపట్టిన బలపరీక్షలో నెగ్గాడు. అయితే ఇక తమిళనాడు రాజకీయమంతా శశి కనుసన్నల నుండే జరగనుందన్న మాట. కాగా శనివారం జరిగిన బలపరీక్షలో తమిళనాడు అసెంబ్లీలో పలు అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. డీఎంకే సభ్యులు చేసిన అరాచకాల కారణంగా స్పీకర్ వారినందరినీ సస్పెండ్ చేశాడు. దీంతో అక్కడ ఉన్న కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యులు వాకౌట్ చేయడంతో సభలో బలనిరూపణ చాలా ప్రశాంతంగా ముగిసినట్లు తెలుస్తున్న అంశం.
ఆ తర్వాత మధ్యాహ్నం మూడు గంటలకు డివిజన్ ఓటింగ్ చేపట్టగా పళని స్వామికి అనుకూలంగా 122 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 11 ఓట్లు (పన్నీరు వర్గం) వేశారు. దాంతో స్పీకర్ ధన్ పాల్ పళని స్వామి బల నిరూపణ పరీక్షలో పాస్ అయినట్లుగా ప్రకటించాడు. మొత్తానికి శనివారం తమిళనాడు అసెంబ్లీ రచ్చ రచ్చగా మారి తీవ్ర ఉద్రిక్తలకు దారితీసినా చాలా ప్రశాంతంగానే నిరూపణ పరీక్ష సాగిందని చెప్పవచ్చు. కాగా అన్నాడీయంకే సభ్యులు విజయం సాధించగానే అక్కడ నుండి నేరుగా జయలలిత సమాధిని సందర్శించి ఆ తర్వాత వెంటనే బెంగుళూరు సెంట్రల్ జైల్లో ఉన్న చిన్నమ్మ ఆశీర్వాదం కోసం ముఖ్యమంత్రి పళని స్వామి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా తమిళనాడులోని డీయంకే సభ్యులు, పన్నీరు వర్గం సభ్యులు మాత్రం రహస్య ఓటింగ్ నిర్వహించమని కోరగా చివరికి డివిజన్ ఓటింగ్ నే జరిపినట్లు తెలుస్తుంది. అయితే శశికళ అన్నాడీయంకే సభ్యులను ముందుగానే బేరం పెట్టి కొనుక్కున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఓటింగ్ కి ముందు ఒక్కో సభ్యుడికి 3కోట్లు ఇచ్చి, ఆ తర్వాత 2 కోట్లు ఇవ్వనున్నట్లు కూడా వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి శశికళ స్కెచ్చే వేరన్నమాట.