ఒకప్పుడు తెలుగు చిత్రాల ఓవర్‌సీస్ మార్కెట్ 2 నుండి 5కోట్ల లోపు ఉండేది. దాంతో నిర్మాతలకు ఓవర్‌సీస్ అనేది నాడు బోనస్‌గానే ఫీలయ్యేవారు. కానీ రాను రాను ఓవర్‌సీస్ మార్కెట్ భారీగా పెరుగుతూ వస్తోంది. అక్కడి తెలుగు చిత్రాల ఓపెనింగ్స్ బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలకు సరిసమానంగా ఉండటం ఆశ్చర్యకరం. దీంతో అందరూ ఓవర్‌సీస్‌ను మదిలో పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఓవర్‌సీస్ మార్కెట్ ద్వారా సినిమా బడ్జెట్‌లో సగం రాబట్టుకునే స్థాయికి చేరారు. ఇక స్టార్ హీరోల చిత్రాలకు అక్కడి మార్కెట్ ఓ కల్పవృక్షంలా మారింది. తాజాగా చూసుకుంటే చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' చిత్రం ఓవర్‌సీస్‌లో 12కోట్లకు పైగానే అమ్ముడయిందని సమాచారం. దానికి తగ్గట్లుగా ఆక్కడ ఆ చిత్రం 2.5మిలియన్ల రాబట్టిందని అంటున్నారు. ఇక ఇప్పుడు పవన్‌కళ్యాణ్ గత చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్' డిజాస్టర్‌గా నిలిచి భారీ నష్టాలను తీసుకొచ్చినా కూడా ఆయన తాజా చిత్రం 'కాటమరాయుడు' కూడా 12కోట్లకు పైగా ఓవర్‌సీస్ రైట్స్‌ని పొందిందనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం ఆల్‌రెడీ తమిళంలో వచ్చిన 'వీరం' ఆధారంగా రూపొందుతోందని తెలిసినా, పవన్ గత చిత్రం డిజాస్టర్ అయినా, ఇప్పటికే అందరూ 'వీరం' చిత్రాన్ని మరీ మరీ చూస్తున్నా.. పెద్దగా పేరులేని డాలీ ఈ చిత్రానికి దర్శకుడైనప్పటికీ ఈ చిత్రానికి అంత భారీ రేట్ పలకడం ఆశ్చర్యమే. ఇక 'బ్రహ్మోత్సవం' చిత్రం భారీ డిజాస్టర్ అయినా కూడా మహేష్ బాబు మురుగదాస్‌తో చేస్తున్న చిత్రానికి 15కోట్లు, 'బాహుబలి2'కి కళ్లు చెదిరే రేటుకు రైట్స్ అమ్మారని వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇంతకాలం ఇంట గెలిచి.. ప్రస్తుతం రచ్చ గెలుస్తున్న మన హీరోలకు ప్రశంసలు దక్కాల్సిందే.