వాస్తవానికి తమిళ ప్రజల మనోభావాలు వేరుగా ఉన్నాయని, పళనిస్వామిని ఎమ్మెల్యేలు బలపరిచినంత మాత్రాన ప్రజలు పళని వైపే ఉన్నారని భావించడం సరికాదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తమిళ ప్రజలు చిన్నమ్మ శశికళ మీద కోపంగా ఉన్నారని, అమ్మ జయలలిత నమ్మినబంటు వంటి పన్నీర్‌సెల్వంను ముఖ్యమంత్రి కావాలని వారు కోరుకుంటున్నట్లు పలు సర్వేలు తేల్చిచెబుతున్నాయి. కానీ కేవలం ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రజల మనోభావాలను అద్దం పట్టదని, తమిళనాడులో జరిగిన పరిణామాలు మన ప్రజాస్వామ్యంలోని అసలు లొసుగులను బహిరంగ పరిచాయనే వాదన బలపడుతోంది. ఈ విషయంలో కొందరు తమిళ నటీనటులు పళనిస్వామి ముఖ్యమంత్రి అయినప్పటికీ, శశికళ బలమైన వర్గం కలిగి ఉన్నప్పటికీ ఆమెకు వ్యతిరేకంగా తమ గళం వినిపిస్తూనే ఉన్నారు.
తాజాగా హీరో సిద్దార్ద్ శశికళపై, పళనిస్వామిపై ఘాటుగానే స్పందించాడు. చట్టసభలో జరిగింది పిల్లలు కూడా గమనిస్తున్నారని, ఇక బెంగుళూరు జైలులో ఉన్న చిన్నమ్మకు ఒక ల్యాప్‌ట్యాప్ ఇస్తే, ఆమె జైలు నుంచే తమిళనాడును ఏలుతుందని, కనీసం ముఖ్యమంత్రి పళనిస్వామికి ప్రతి నిర్ణయానికి ముందు బెంగుళూరు వెళ్లే ప్రయాణ ఖర్చులు కూడా తగ్గుతాయని ఎద్దేవా చేశారు. ఈ ఆవేదనలో నిజం ఉంది. మరలా ప్రజల తీర్పును కోరాలని, ప్రస్తుత పరిణామాలు ప్రజల మనోభావాలకు అనుగుణంగా లేవని అరవింద్‌స్వామి తెలిపారు. ఇక ఈ విషయంలో కమల్‌హాసన్, గౌతమి, రాధికాశరత్‌కుమార్... వంటి వారందరూ తమ గళం వినిపిస్తున్నారు. ఇక సిద్దార్ద్ అయితే మరో అడుగు ముందుకేసి మనం తినే తిండిలో ఇంకాస్త కారం, ఉప్పు వేసుకోవాలని, తమిళుల పౌరుషం తగ్గిందని ఘాటుగా చేసిన వ్యాఖ్యలు వాస్తవమే. ఈవిషయంలో మన ఏపీ ప్రజలు కూడా కాస్త ఉప్పు,కారం ఎక్కువ వేసుకోవాలి. బిపి వచ్చినా కూడా కనీసం పౌరుషమైనా మిగులుతుంది.. ప్చ్.. ఏం ప్రజాస్వామ్యం రా.. బాబు...!