పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కాటమరాయుడు' షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఒక్క టీజర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన పవన్ కళ్యాణ్... రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇక సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇవ్వకుండా పవన్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. 'కాటమరాయుడు' సినిమాని ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలాఖరులోపు విడుదల చెయ్యడానికి డైరెక్టర్ డాలి, నిర్మాత శరత్ మరార్ సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే 'కాటమరాయుడు' ఆడియో అదిగో ఉంటుంది ఇదిగో ఉంటుందని చెప్పినప్పటికీ ఆడియో ని జరపకుండా క్యాన్సిల్ చేసినట్లు సమాచారం అందుతుంది. అలాగే ఒక్కో సాంగ్ ని ఆన్ లైన్ లో విడుదల చేస్తారని చెబుతున్నారు.
అయితే ఆడియో ని రద్దు చేసినప్పటికీ ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా చెయ్యాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మెగా హీరోలైన అల్లు అర్జున్ 'సరైనోడు', రామ్ చరణ్ 'ధృవ', చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' చిత్రాల ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని గ్రాండ్ గా నిర్వహించి ఆ సినిమాలు హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు మరో మెగా హీరో సాయి ధర్మ తేజ్ కూడా 'విన్నర్' చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించి మెగా సెంటిమెంట్ కి నాంది పలికాడు. మరి ఇప్పుడు 'కాటమరాయుడు' చిత్రానికి కూడా గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని నిర్వహించి మెగా హీరోల సెంటిమెంట్ తోనే హిట్ కొట్టాలని చూస్తున్నారట. అయితే ఈ ఆడియో వేడుక రద్దుగాని, ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి గాని ఇప్పటివరకు దర్శక, నిర్మాత, హీరోల నుండి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.