పాత చిత్రాల ప్రేమికులు ఎందరో ఉన్నారు. అలాంటి క్లాసిక్స్‌ను మరలా చూడగలమా? లేదా? అని చింతించే వారు కూడా ఉన్నారు. పాత తరంలో వచ్చిన చిత్రాలను కొత్తతరం వారు ఆదరిస్తారా? లేదా? అని ఆలోచించే వారు కూడా ఉన్నారు. అయినా కూడా వాటిని మరలా రీమేక్ చేస్తే చూడాలని ఆశపడే వారు ఉన్నారు. కానీ 'గుండమ్మకథ'ను బాలకృష్ణ, నాగార్జునలతో కలిసి చేయించడానికి చాలా కాలం ఎందరో ప్రయత్నించారు. కానీ 'గుండమ్మ'గా టైటిల్ పాత్రను పోషించిన సూర్యకాంతానికి తగ్గ నటీమణులు దొరక్కపోవడంతో అలాంటి కళాఖండాలను నిలువునా చంపేయకూడదని భావించారు. దీనికి 'షోలే'ని మరలా తీసి పరువు తీసిన వర్మనే పెద్ద ఉదాహరణ.
ఇక ఆ పాత చిత్రాలను మరలా థియేటర్లలో నేటితరం ప్రేక్షకులు సరిగా చూస్తారా? లేదా? అంటే దానికి ఎవ్వరూ ఖచ్చితంగా సమాధానం ఇవ్వలేరు. నేడు కలర్ చిత్రాలు, స్కోప్‌లు, స్టీరియోఫోనిక్ సౌండ్‌లు, గ్రాఫిక్స్‌లు రాజ్యమేలుతున్న కాలంలో వాటిని చూస్తారని కూడా ఎవ్వరూ హామీ ఇవ్వలేరు. మహా చూడాలంటే.. టీవీ చానెల్స్‌లో వచ్చినప్పుడు చూసి ఆనందిస్తారు. కానీ కొందరు నిర్మాతలు మాత్రం ఈ విషయంలో డబ్బును, శ్రమను కూడా లెక్కచేయకుండా పాత చిత్రాలకు డిజిటల్ హంగులు, కలర్స్ అద్ది, మంచి మ్యూజిక్ సిస్టమ్‌తో ప్రేక్షకుల ముందుకు తెచ్చే సాహసం చేస్తున్నారు. ఇది చాలా పెద్ద రిస్క్. కానీ కొందరు మాత్రం దానికి సిద్దపడుతున్నారు. బాలీవుడ్ క్లాసిక్ మొఘల్ ఏ ఆజమ్‌ని అలాగే విడుదల చేశారు.
రజనీ 'శివాజీ'ని మరిన్ని హంగులతో తీర్చిదిద్దారు. సినిమా ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన 'భాషా' చిత్రాన్ని అలాగే కొత్త హంగులతో మార్చి 3న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ఇక మన తెలుగులో అలనాటి క్లాసిక్ 'మాయా బజార్'ను కూడా ఎంతో శ్రమతో కలర్స్‌లోకి మార్చారు. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. నేడు అందరూ గ్రాఫిక్స్ అని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ 'మాయా బజార్' కాలంలోనే ఘటోత్కజునిగా నటించిన ఎస్వీరంగారావుపై తీసిన 'వివాహ భోజనంబు.. ' అనే పాటలో చూపిన అద్భుతమైన కెమెరా మాయాజాలం చిన్న విషయం కాదు. ఇక డి.రామానాయుడు స్వంతంగా, తానొక్కడే నిర్మించిన మొదటి చిత్రం, ఆయన కెరీర్‌లో బాగా ఎదగడానికి దోహదపడిన చిత్రం 'రాముడు-భీముడు'. స్వర్గీయ ఎన్టీఆర్ హీరోగా ద్విపాత్రాభినయం చేసి మెప్పించిన ఆ కళాఖండం కథను ఇప్పటికీ ఎందరో కాపీ కొడుతున్నారు. దర్శకుడు తాపి చాణిక్య చూపించిన ప్రతిభ అనన్యసామన్యం.
ఇదే పేరుతో , ఇదే కాన్సెప్ట్‌లో బాలకృష్ణ సైతం ఓ చిత్రం చేశాడు. కానీ తండ్రికి ధీటుగా చేయలేకపోయాడు. దాంతో అదే పాత చిత్రానికి మరలా ఆధునిక హంగులు జోడించి విడుదల చేయాలనేది స్వర్గీయ రామానాయుడు కోరిక. అది తీరకుండానే ఆయన కన్నుమూశారు. కానీ ఇప్పుడు తన తండ్రి కలను నెరవేర్చడానికి సురేష్‌బాబు ముందుకు రావడం హర్షణీయం. అయితే ఇక్కడ ఓ విమర్శ కూడా ఉంది. పాత చిత్రాలను మరలా కలర్‌లోకి మారిస్తే ఒరిజినాలిటీ దెబ్బతింటుందని, వాటిని బ్లాక్ అండ్ వైట్‌లో చూడటమే ఆనందాన్నిస్తుందని కొందరు భావిస్తున్నారు. ఇది నిజమే. కానీ ఆ పాత క్లాసిక్స్‌ను నేటితరం వారిచేత చేయించి, చెడగొట్టడం కంటే, కిల్ చేయడం కంటే ఇలా ఆధునిక హంగులు దిద్దడమే మేలనే అభిప్రాయం బలంగా ఉంది.