ప్రస్తుతం 'బాహుబలి-ది కన్‌క్లూజన్' షూటింగ్‌ను పూర్తి చేసి, పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్‌లో రాజమౌళి బిజీగా ఉన్నాడు. కాగా రాజమౌళి క్రియేటివిటీపై చాలా మందికి సందేహాలున్నాయి. శివగామి లుక్, పోస్టర్ నుంచి తాజాగా విడుదల చేసిన 'బాహుబలి2' మోషన్ పోస్టర్‌లో మదగజంపై ఎక్కిన ప్రభాస్ పోస్టర్ కూడా ఓ హాలీవుడ్ మూవీకి కాపీ అని ప్రూఫ్‌లతో సహా నెటిజన్లు ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా ఆయన సుమకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 'బాహుబలి -దికన్‌క్లూజన్' గురించి మాట్లాడాడు.
ఈ చిత్రం తర్వాత తాను మహాభారతం తీయడం లేదని, దానికి మరో పదిపదిహేనేళ్లు పడుతుందని, అప్పటికిీ సాంకేతికంగా ఎన్ని మార్పులు వస్తాయో తెలియదని, మహాభారతం తీయడానికి చాలా అనుభవం కావాలని చెప్పి, ఆయన తదుపరి చిత్రం మహాభారతం అనే రూమర్లకు చెక్‌పెట్టాడు. ఇక ఈ చిత్రం టీజర్ డేట్ ఇప్పుడే చెప్పలేనని, మార్చి రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉందని, ప్రస్తుతం గ్రాఫిక్స్ పని నడుస్తోందన్నాడు. డేట్ చెబితే ఇబ్బందులు వస్తాయన్నాడు. ఇక బాహుబలి మొదటి పార్ట్ మంచి విందు ముందు స్టార్టర్ వంటిదని, బాహుబలి 2 మంచి విందుగా చెప్పుకొచ్చాడు. మొదటి పార్ట్‌లో కేవలం పాత్రలను పరిచయం చేశానని, రెండో పార్ట్‌లో ఆయా పాత్రల ఎమోషన్స్ ఉంటాయని తెలిపాడు.
కట్టప్ప, శివగామి వంటి పాత్రల ఎమోషన్స్ చాలా బాగుంటాయని స్పష్టం చేశాడు. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్‌ను అందరూ బాహుబలిగానే పిలుస్తున్నారని, పాత్రలో లీనమవ్వడమే దానికి కారణమన్నాడు. ఇక 'బాహుబలి- ది కన్‌క్లూజన్' తర్వాత వెండితెరపై బాహుబలిని సాగదీయడం జరగదని, కథ అక్కడితో సమాప్తమవుతుందని తెలిపాడు. కానీ ఆయా పాత్రలు మాత్రం నవలలు, కామిక్స్, టీవీ సీరీస్‌లు, వీడియో సిరీస్‌లలో కొనసాగుతాయన్నాడు. ఇక ప్రభాస్, రమ్యకృష్ణ, నాజర్‌ల నటనా శైలి భిన్నమని, రమ్యకృష్ణకు ముందుగా కథ చెప్పాల్సిన పని లేదని, స్పాట్‌కి వచ్చిన తర్వాత డైలాగ్ చెబితే చాలు విశ్వరూపం చూపిస్తుందని, నాజర్‌కు ముందుగా సీన్ చెప్పాలని, మరికొందరికి సీన్స్ నటించి చూపాలని చెప్పుకొచ్చాడు. మరి సీన్ నటించి మరీ చూపించాల్సిన నటులు ఎవరా? అనే దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ సాగుతోంది.