మన సినిమా వారు ఎక్కడ సంపాదించిన సొమ్మును అక్కడే ఖర్చు చేయాలని భావిస్తున్నట్లుగా ఉంది. ఇందులో భాగంగానే పలువురు స్టార్ దర్శకులు నిర్మాతలుగా మారుతున్నారు. అయితే తాము మాత్రం భారీ బడ్జెట్ చిత్రాలను డైరెక్ట్ చేస్తూ, మరోవైపు చిన్న సినిమాలను నిర్మిస్తూ తమ ముందుచూపును చూపుతున్నారు. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా నితిన్, పవన్‌లతో కలిపి 'రౌడీఫెల్లో' ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ చిత్రాన్ని లాంచనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ నిర్మాతగా తన జోరును పెంచనున్నాడు. మొదటి చిత్రం మొదలుకాకముందే ఆయన ప్రస్తుతం జోరు మీదున్న శర్వానంద్ హీరోగా ఓ కొత్త దర్శకునితో ఓ వైవిధ్యమైన కథను నిర్మించనున్నాడట. ఇక అదే సమయంలో 'పెళ్లిచూపులు' ద్వారా ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ హీరోగా నందినిరెడ్డి దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడనే వార్తలు వస్తున్నాయి. నిజానికి త్రివిక్రమ్‌కు ఇంత వరకు ఓన్ బేనర్ లేనప్పటికీ ఆయన ఇటీవల వరుసగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌లోనే రాధాకృష్ణ నిర్మాతగా చిత్రాలు చేస్తున్నాడు. ఈబేనర్ కూడా త్రివిక్రమ్‌కు ఓన్ బేనర్ వంటిదే. ఈ బేనర్‌లో నిర్మితమయ్యే చిత్రాలకు మాటల మాంత్రికుడు పారితోషికం కాకుండా భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడనే గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి. సాధారణ సబ్జెక్ట్‌ను కూడా తన మాయ మాటలతో గారడీ చేసి విజయం సాధించే త్రివిక్రమ్ నిర్మాతగా కూడా కథల ఎంపిక, బడ్జెట్, మాటలు తదితర విషయాలలో ఎలాంటి మాయచేయనున్నాడో వేచిచూడాల్సివుంది...!