అనుపమ పరమేశ్వరన్.. ఆమె ఇటీవల టాలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది. ఆమె టాలీవుడ్‌లో నటించిన మొదటి మూడు చిత్రాలైన 'ప్రేమమ్, ఆఆ, శతమానం భవతి'లతో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. దాంతో ఆమెకు గోల్డెన్‌లెగ్ అనే పేరు వచ్చింది. ఇక ఏ అప్‌కమింగ్ హీరోయిన్ అయినా స్టార్స్ చిత్రాలలో అవకాశం వస్తే ఎగిరిగంతేస్తారు. అలాంటి అవకాశాలు చేజారితే కుంగిపోతారు. ఇది సహజం. కానీ ఈ కేరళ కుట్టి అయిన అనుపమ మాటలను వింటుంటే మాత్రం ఆమె నమ్మకానికి అమ్మలా కనిపిస్తోంది. ఆమెకు సుకుమర్, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. మరి ఏవో కారణాల వల్ల ఆ ఛాన్స్‌ను సమంత తన్నుకుపోయింది. ఈ చిత్రంలో తనకు అవకాశం వచ్చిన మాట వాస్తవమేనని, కానీ అది పోయినందుకు తనకు ఎలాంటి బాధ లేదంటోంది ఈ అమ్మడు.
ఇక ఎన్టీఆర్-బాబిల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కూడా ఈ అమ్మడికి అవకాశం వచ్చినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఛాన్స్ తన వద్దకు రాలేదని ఆమె అంటోంది. తన వయసు ఇంకా 21ఏళ్లే అని వయసును కూడా డేర్‌గా చెప్పేసింది. తనకు ఇంకా చాలా కెరీర్, భవిష్యత్తు ఉన్నాయని, ఆ సమయంలో తాను అందరి హీరోల సరసన నటించడం ఖాయమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తోంది. అవకాశాలు మిస్సయినా తనకు బాధ లేదని ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది. మొత్తానికి అ అమ్మడి కాన్ఫిడెన్స్‌ను మాత్రం అభినందించకుండా ఉండలేం. ఈ స్టేట్‌మెంట్స్‌ను చూసిన కొందరు విశ్లేషకులు ఈమె మలయాళం భాషను కూడా వదిలేసి టాలీవుడ్‌లోనే మకాం వేసినా ఆశ్యర్యం లేదంటున్నారు.