టాలీవుడ్ ఖ్యాతిని నలుదిశలా చాటిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం ఎన్నో ఘనమైన రికార్డులను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్ గా బాహుబలి రెండవభాగం రూపొందిన విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ మాసంలో విడుదలకానున్న ఈ సినిమాను చూడటానికి ఎలిజబెత్ మహారాణి వస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇది చాలా గొప్ప విషయంగానే చెప్పుకోవాలి. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్భై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్రిటిష్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్, ఇండియన్ సినిమాలకు గౌరవిస్తూ ఇండియా ఆన్ ఫిల్మ్ ఈవెంట్ అని ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో ఇండియాకు సంబంధించిన సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలో మన తెలుగు సినిమాను ప్రదర్శించడం మనకు దక్కిన గౌరవంగా భావించాలి. బ్రిటన్ మహారాణి ముఖ్య అతిథిగా వస్తున్న ఈ వేడుకలో బాహుబలి 2 ని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తుంది.
అందుకనే ఏప్రిల్ 28న విడుదల తేదీన థియేటర్స్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇలా ముందుగానే విడుదల కానుందని తెలుస్తుంది. ఈ వేడుకకు క్వీన్ ఎలిజబెత్-2, ప్రధాని నరేంద్రమోడీ హాజరుకానున్నట్లు సమాచారం అందుతుంది. అందుకని రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి 2 ’ సినిమా ప్రీమియర్ షోని క్వీన్ ఎలిజబెత్-2, ప్రధాని మోడి కోసం ప్రదర్శించనున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం విడుదలైన ‘బాహుబలి మొదటి భాగం ది బిగినింగ్’ ప్రపంచవ్యాప్తంగా ఎవ్వరూ ఊహించని విధంగా బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రాన్ని ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో కూడా ప్రదర్శించారు. కాగా ఇప్పుడు తాజాగా వచ్చిన ఈ ఘనమైన అవకాశాన్ని వినియోగించుకొనేందుకు చిత్రబృందం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ని వేగంగా పూర్తి చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తుంది.