నేడు నాని రేంజ్ గురించి అందరికీ తెలుసు. సాధారణంగా ఓ రెండు మూడు పెద్ద హిట్ చిత్రాలు సాధిస్తే ఆయా హీరోలతో పనిచేయడానికి స్టార్ డైరెక్టర్స్ ఆసక్తి చూపుతారు. కానీ నాని మాత్రం వరసగా రెండు హ్యాట్రిక్‌లను నమోదు చేసినా కూడా స్టార్ డైరెక్టర్లు మాత్రం ఆయనపై అంతగా ఆసక్తి చూపడం లేదన్నది వాస్తవం. ఇది ఎందువల్లో ఎవరికి అర్ధం కావడం లేదు. ఇక దీంతో నేచురల్‌స్టార్‌గా ఎదిగిన నాని తాను కూడా స్టార్ డైరెక్టర్స్‌ని పట్టించుకోవడం మానేశాడు. కుర్ర దర్శకులనే స్టార్ డైరక్టర్స్‌గా మార్చే పనిలో పడ్డాడు. ఈ ఏడాది ఆయన 'సినిమా చూపిస్త..మావా' దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'నేను.. లోకల్' వంటి భారీ హిట్టునిచ్చాడు.
ప్రస్తుతం దానయ్య నిర్మాతగా కొత్త దర్శకుడు శివ శర్వాణను దర్శకునిగా పరిచయం చేస్తూ 'నిన్నుకోరి' అనే చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత తనతో 'కృష్ణగాడి వీరప్రేమగాథ' తీసిన హను రాఘవపూడికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశాడు. ఇక తన స్నేహితుడైన యువ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో మరో చిత్రం చేయనున్నాడు. ఇక దిల్‌రాజు నిర్మాతగా 'ఎంసిఏ' (మిడిల్ క్లాస్ కుర్రాడు) చిత్రం చేయనున్నాడు. ఆ వెంటనే 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా'లతో అందరినీ మెప్పించిన మరో యువదర్శకుడు మేర్లపాక గాంధీకి ఓకే చెప్పాడట. ఇలా నాని కుర్రాళ్లతోనే తన జోరు చూపిస్తున్నాడు. మరి పెద్ద పెద్ద డైరెక్టర్స్ నానిని పట్టించుకోకపోవడంపై ఇండస్ట్రీలో కూడా పలు రూమర్లు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తనదైన రూట్‌లో వెళ్తున్న నానిని మెచ్చుకోవాల్సిందే.