'కాటమరాయుడు' సందడి మొదలైపోయింది. ఈ నెలాఖరులో సినిమా రిలీజ్ ఉంటుందని చెబుతున్నారు కాబట్టి ఇక పబ్లిసిటీ కార్యక్రమాల జోరు పెంచేశారు. ఇప్పటికే ఆడియో సాంగ్స్ ని మార్కెట్ లోకి నేరుగా విడుదల చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న చిత్ర యూనిట్ నిన్న శుక్రవారం అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించిన 'కాటమరాయుడు' టైటిల్ సాంగ్ ని యూట్యూబ్ లో విడుదల చేసింది. 'రాయుడో.... నాయకుడై నడిపించేవాడు.... సేవకుడై నడుమొంచేవాడు.... అందరికోసం అడుగేసేవాడు.... రాయుడో.... మిర్ర మిర్రా మీసం మెలితిప్పుతాడు జనం కోసం...' అంటూ సాగే ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం కొన్ని గంటల్లో ఈ పాట యూట్యూబ్ లో వరల్డ్ వైడ్ టాప్ 10 ట్రెండ్స్ లో ఒకటిగా నిలిచింది. 'కాటమరాయుడు' పాట కేవలం 4 గంటల్లోనే మిలియన్ మార్క్ ను కూడా దాటేసి ఇంతవరకు టాలీవుడ్ లో ఏ సినిమా సాధించని రికార్డు నమోదు చేసి మిగతా హీరోలకి సవాల్ విసిరింది.
ఇక ఈ పాట యూట్యూబ్ లో దుమ్మురేపుతూ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసింది. అయితే పవన్ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఇంతటి పవర్ ఫుల్ పాటని వాడారని అంటున్నారు. ఏది ఎలాగున్నా కాటమరాయుడు పాట మాత్రం మరిన్ని సంచనాలు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వస్తున్నారు. ఒక్క సాంగ్ కే ఇలా ఫ్యాన్స్ ఉర్రుతలూగుతుంటే మిగతా పాటలు కూడా విడుదలైతే వాళ్లెవరు భూమి మీద ఆగేలా లేరని అంటున్నారు. అసలు పవన్ స్టామినా ఏమిటో 'కాటమరాయుడు' టీజర్ తోనే అర్ధమైపోయింది. 'కాటమరాయుడు' టీజర్ యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ ఆక్రమించుకుని తనకి ఎదురు లేదని ప్రూవ్ చేసింది. ఇలా పాటలన్ని ఒక్కొక్కటిగా మార్కెట్ లోకి విడుదల చేస్తూ 'కాటమరాయుడు' సందడి మార్చ్ నెల మొత్తం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా... డాలి దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్నాడు.