తెలుగు ప్రజలను రెండు రాష్ట్రాలుగా విభజించిన కేంద్రప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని మరచి ప్రత్యేక ప్యాకేజీ అంటూ మాటల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఏపీ సర్కారు కూడా కేంద్రానికి అనుకూలంగా తలూపి హోదా వేస్టు ప్యాకేజీనే బెస్టు అని పేర్కొంటూ ప్రజలను శాంతపరిచే మాటలు మాట్లాడుతున్న విషయం కూడా విదితమే. ఏదీ ఏమైనప్పటికీ విభజనతో ఆంధ్ర ప్రదేశ్ కి జరిగిన నష్టాన్ని భర్తీ చేయటానికి హోదానే కీలకమన్న విషయం కాదనరాని సత్యం. చంద్రబాబు నిరంతరం ఏపీని చూస్తుంటే దిక్కూ మొక్కూలేని అనాధలా పడి ఉందని, ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే గుండె తరుక్కు పోతుందని, ఆ కసితోనే తాను నిరంతరం శ్రమించి రాష్ట్రాభివృద్ధికి తీరిక లేకుండా కృషి చేస్తున్నాని వివరిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలా నిరంతరం గొప్పలు చెప్పుకునే చంద్రబాబు తన గొప్పతనాన్ని గవర్నర్ చేత కూడా చెప్పించడం ఇక్కడ గొప్ప విషయం.
అమరావతి రాజధాని ప్రాంతంలోని వెలగపూడిలో ఏర్పాటు చేసిన తాత్కాలిక అసెంబ్లీ తొలి సభా సమావేశాల సందర్భంగా గవర్నర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో గవర్నర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా ఇక కష్టమేనన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు. హోదాని ప్రత్యేక ప్యాకేజీ భర్తీ చేసేసినట్లుగానే వెల్లడించాడు. అంటే ఇక హోదాపై ఆశలు వదులుకోవాలని ఏపీ ప్రభుత్వమే గవర్నర్ చేత చెప్పించినట్లుగా తెలుస్తుంది.
అంటే ఇక హోదా హుళక్కేనంటూ వెల్లడించేసి ఇచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధతను తాము కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇలా ఆంధ్రప్రదేశ్ లో చారిత్రకంగా మొట్టమొదటి సమావేశాల్లోనే ఏపీ ప్రభుత్వం అదీ గవర్నర్ ద్వారా ఏపీ ప్రయోజనాలకు గండిపడేలా చెప్పించడం ఎంతైనా విచారకరం. మొత్తానికి గవర్నర్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను గాలికొదిలేసేలా మాట్లాడటం ఎంతైనా శోచనీయం.