ఇప్పుడు నానికి టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. ఆయనతో చిత్రాలు తీసేందుకు ఆయన ఇంటిముందు అందరూ క్యూ కడుతున్నారు. ఇప్పటికే ఆయన నిర్మాతలు, అభిమానులు తమ హీరో అనితర సాధ్యమైన డబుల్ హ్యాట్రిక్‌ను సొంతం చేసుకున్నాడని ఉప్పొంగిపోతూ ఆయనకు నేచురల్‌స్టార్ అనే బిరుదును కూడా ఇచ్చేశారు. ప్రస్తుతం తన మార్కెట్‌ను 30కోట్ల దగ్గర స్దిరపడే విధంగా చర్యలు తీసుకుంటున్నాడు నాని. ఇక క్రేజ్ ఉన్నప్పుడు నాలుగు రాళ్లు వెనకేసుకోవడంపై దృష్టి పెట్టాడు. అన్ని రంగాల వైపు సంపాదనాపరంగా ఒడివడిగా అడుగులు వేస్తున్నాడు. ఆల్‌రెడీ ఆయన దర్శకత్వ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి కొంతకాలం తర్వాత ఆయన డైరెక్టర్‌గా మారడం కూడా ఖాయం. కాగా ఆమధ్య 'డి ఫర్ దోపిడీ' అనే చిత్రానికి భాగస్వాములలో ఒకడిగా వ్యవహరించాడు. కానీ ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. ఇక త్వరలోనే ఆయన తన ఫ్రెండ్స్‌తో కలిసి ఓ సొంత బేనర్ పెట్టాలని, తన క్రేజ్‌ను తానే సొంతం చేసుకోవాలని అందరూ హీరోలలాగానే తాను ఆలోచిస్తున్నాడని సమాచారం.
ఇక ఈయన మణిరత్నం తెరకెక్కించి, తెలుగులో దిల్‌రాజు విడుదల చేసిన 'ఒకే బంగారం' వెర్షన్‌కు హీరో దుల్కర్ సల్మాన్‌కి వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా ఆయన ఆ చిత్ర విజయంలో కీలకపాత్రను పోషించాడు. ప్రస్తుతం నానికి మరో శాఖలో కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. వాస్తవానికి రాజమౌళి 'బాహుబలి' చిత్రం ఆడియోను ఆయనే హోస్ట్ చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. ఇక త్వరలో జరగనున్న ఐఫా అవార్డుల వేడుకకు ఆయన రానాతో కలిసి హోస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ సంస్థ నిర్వాహకులు ప్రస్తుతం నానికి ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ఉద్దేశ్యంతో ఆయన్ను సంప్రదించి మంచి పారితోషికం ఆఫర్ చేశారని సమాచారం. గతంలో ఈ ఐఫా, సైమా వంటి వేడుకలకు రానాతో పాటు అల్లుశిరీష్, నవదీప్, రెజీనా వంటి వారు హోస్ట్ చేసి ఉన్నారు. ఇక బాలీవుడ్‌లో అయితే సల్మాన్, షారుక్, అమీర్, హృతిక్ వంటి వారు కూడా పలు కార్యక్రమాలకు హోస్ట్‌గా పనిచేస్తూ, ఆ వేడుకలను రక్తికట్టిస్తూ, సంపాదన కూడా బాగా ఉండేలా చూసుకుంటుంటారు. ఇప్పుడు అదే స్ట్రాటర్జీని నాని ఫాలో కానున్నాడు.