తప్పులు అందరూ చేస్తారు. కానీ చేసిన తప్పులను తిరిగి చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడమే విజ్ఞులు చేసే పని. ప్రస్తుతం పవన్ తన పార్టీ జనసేన విషయంలో కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తన అభిమానులకు, మెగాభిమానులతో పాటు ఆ సామాజిక వర్గం వారికి బాధ కలిగించినా సరే తన అన్నయ్య, తాను కలిసి పనిచేసే ప్రసక్తే లేదని, మా ఇద్దరి మనోభావాలు వేరని, తాము ఒకే తాటిపై నడవడం అసాధ్యంగా పవన్ పేర్కొన్నాడు. దీంతో ఇంతకాలం కొందరు చిరు త్వరలో పవన్‌తో కలుస్తాడని పెట్టుకున్న ఆశలను, మరోవైపు చిరు. పవన్‌లు ఒక్కటేనని, వారు నాటకాలాడుతున్నారని విమర్శించే వారికి పవన్ చెక్‌పెట్టాడు. కాస్త కఠిన నిర్ణయమే అయినా ఈ విషయంలో పవన్ తీసుకున్న నిర్ణయాన్ని సాధారణ ప్రజలు మాత్రం హర్షిస్తున్నారు. ఇక పవన్‌కి కులం గురించి పెద్దగా ఆసక్తిలేదు. కేవలం తన సామాజిక వర్గం అనే కోణంలో ఆయన ఇప్పటివరకు ఎప్పుడు మాట్లాడలేదు. ఆయన కులం వారికి అది బాధాకరమే అయినా పవన్ ఈ విషయంలో కూడా విజ్ఞతతో కూడిన నిర్ణయం తీసుకున్నాడు.
మరోపక్క ప్రస్తుతం విద్యార్ధులకు పరీక్షల సీజన్‌కాబట్టి వారి చదువులకు అడ్డురాకూడదనే తాను ప్రత్యేకహోదా ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశానని చెబుతున్నాడు. కానీ ప్రత్యేకహోదా విషయంలో ప్రజల మనోభావాలు ఏమిటి? అనే విషయంలో ఆయన మరోసారి పున:సమీక్షించుకోవడం అవసరం. మరోవైపు ప్రభుత్వాలపై అనవసర విమర్శలు కాకుండా, నిర్మాణాత్మక సమస్యలు ప్రస్తావించడం కూడా మరో మంచి నిర్ణయం. మంచి చేసినా చెడును ఎత్తి చూపుతూ ప్రతి విషయానికి రాజకీయరంగు పులమాలని చూసే రాజకీయపార్టీల వలే కాకుండా పవన్ ఈ విషయంలో కూడా పరిణితితో వ్యవహిరించాడు. ఇక ప్రజారాజ్యం పార్టీలోకి పలువురు పలు పార్టీల నుంచి వచ్చి, వ్యక్తిగత అజెండాలకు చోటిచ్చారని కూడా పవన్ ఒప్పుకున్నాడు. కాబట్టి వేరే పార్టీ వారు జనసేనలోకి రాదలిస్తే వారి వ్యక్తిత్వం, ప్రజల్లో వారికున్న క్రెడిబులిటీ, పార్టీకి సీనియర్ల అవసరం ఉన్నా కూడా ఎందరిని, ఎవరిని తీసుకోవాలనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటానని పవన్ చెబుతున్నాడు. మొత్తానికి పవన్ ఉద్దేశ్యాలు, భావాలైతే బాగున్నాయి. మరి వాటిని ఆయన ఎలా చేతల్లో చూపుతాడో? వేచిచూడాల్సివుంది.