ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి వక్త. అంతకు మించి రచయిత. అంతకు మించిన దర్శకుడు కూడాను. ఆయన సినిమాల్లో డైలాగులు బాగా పేలుతుంటాయి. అంతే స్థాయిలో బయట కూడా పేలుస్తుంటాడు. ఆయన మాట్లాడే మాటలు మళ్లీ మళ్లీ వినాలనిపించేలా ఉంటాయి. అప్పట్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి అనర్గళంగా మాట్లాడిన త్రివిక్రమ్ యూట్యూబ్ లో సంచలనం రేపేలా మారింది. అసలు కల్యాణ్ గురించి మాట్లాడటం అంటే త్రివిక్రమ్ కు ఎక్కడలేని ఉత్సాహం వస్తుందనుకో. పవన్ కళ్యాణ్ గురించి త్రివిక్రమ్ ఎప్పుడు మాట్లాడినా అది చాలా అద్భుతంగా ఉంటుంది. అత్తారింటికి దారేది సమయంలో పవన్ గురించి త్రివిక్రమ్ పలికిన ప్రతి పలుకూ పవన్ అభిమానులకు మంచి విందు భోజనమైన విషయం తెలిసిందే. తాజాగా కాటమరాయుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కి ముఖ్య అతిథిగా త్రివిక్రమ్ హాజరవుతారు అంటేనే అభిమానులకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. ఈ సారి కూడా పవన్ అభిమానులు ఆశించిన విధంగానే పవన్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పీచ్ సాగింది. పవన్ శక్తిమంతుడని, మానవత్వం ఉన్న గొప్ప మనిషి అంటూ అదిరిపోయేలా మాట్లాడాడు. ఒకడు చేయెత్తితే జనం ఆగిపోవడం, ఇటు వెళ్లండి అంటే అలా గుడ్డిగా వెళ్లిపోవడం.. ఇటువంటి శక్తి కోట్లలో ఒక్కడికే దేవుడు ఇస్తాడని, ఆ ఒక్కడూ ఎవరో చెప్పాల్సిన పనిలేదని పవన్ కెపాసిటీని చెప్పకనే చెప్పాడు త్రివిక్రమ్. ఇంకా త్రివిక్రమ్ మాట్లాడుతూ.. మనిషెప్పుడూ కూడా ఊరవతల మర్రి చెట్టులా ఉండాలి. ఎందుకంటే మర్రి చెట్టు ఎండాకాలం నీడనిస్తుంది. వర్షంలో కూడా తడవకుండా కాపాడుతుంది. ఇంత చేస్తున్నా ఎప్పుడూ నన్ను గుర్తించు అని అడగదు. పవన్ కూడా అంతే. మౌనంగా ఎంత మందికి సహాయం చేశారో లెక్కపెట్టుకోకుండా, గుర్తు పెట్టుకోకుండా అలా చేస్తుంటాడు అన్నాడు త్రివిక్రమ్. ఇంకా.. పవన్ కళ్యాణ్ మాట్లాడితే అది వేయి గొంతుకల ప్రతిధ్వనిస్తుందని, ఇంకా చాలా మంది కలసి వేసిన ఒక్క అడుగు పవన్ అని, పవన్ నిలువెత్తు మంచితనానికి నిదర్శనం అని అందుకే పవన్ కు ఇంతమంది అభిమానులు ఉన్నారని పవన్‌ని ఆకాశానికి ఎత్తేశాడు త్రివిక్రమ్. మొత్తానికి పవన్ అంటే చాలు త్రివిక్రమ్ ఏంటో అలా భావ ప్రవాహాన్ని వెదజల్లుతాడు. ప్రశంసలతో ముంచెత్తుతాడు.