జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలువెత్తు మానవత్వానికి ప్రతిరూపం అంటూ ప్రముఖులంతా గొప్ప భజనే చేశారు... కాటమరాయుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ సాక్షిగా. అయితే... తన ఎదుట ఎవరైనా కష్ట పడుతుంటే చూడలేరని, అందినంత సాయం చేస్తూ ఎంతో ఉదారతను ప్రదర్శిస్తుంటారని వెలిబుచ్చారు ఆ సినీ పెద్దలు. ఇంకా పవన్ చేసేవి చెప్పుకోడని అలాంటి నైజం పవన్ ది కాదని, అలా చేసుకుంటూ పోవడం తన బాధ్యతగా భావిస్తుంటాడని ఎన్నడూ కూడా ఎంత చేశాం అనిగానీ, ఎవరికి చేశాం అన్నదిగానీ అస్సలు పట్టించుకోడని ఆ వేడుకను ఆధారం చేసుకొని సినీ ప్రముఖులంతా పవన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ పొగడ్తల వర్షానికి తడిచి ముద్దవడం పవన్ వంతైంది. అయితే... పవన్ తాజా చిత్రమైన కాటమరాయుడు వేడుక సందర్భంగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రం ద్వారా తాను రెండు కోట్ల వరకు నష్టపోయానని ఒక డిస్ట్రిబ్యూటర్ నిరాహార దీక్షకు సైతం కూర్చున్నాడు. కొన్ని రోజులుగా ఆయన ‘సర్దార్’ నిర్మాత మీద, పవన్ మేనేజర్ మీద ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తనకు అన్యాయం జరిగిందని తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.ఆ తర్వాత ఈయనకు తోడుగా మరికొంత మంది ‘సర్దార్’ బాధితులు కూడా గళం విప్పుతున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గానీ, ఆ నిర్మాత గానీ నోరు విప్పక పోవడం ఆశ్చర్యం కలిగించే అంశం.
ఇక్కడ విషయం ఏంటంటే.. గతంలో పవన్ కళ్యాణ్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా నష్టపోయిన పంపిణీ దారులకు కాటమరాయుడు సినిమాను ఇచ్చి ఆదుకుంటామని మాటిచ్చాడు. కానీ పవనైతే అప్పట్లో మాటిచ్చాడు గానీ ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. సర్దార్ పంపిణీదారులెవరికీ కాటమరాయుడు ఇవ్వకపోవడం శోచనీయం. వాళ్ళంతా నిరాహార దీక్ష చేస్తున్నా ఏమాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసే అంశం. పవన్ అప్పట్లో మాటిచ్చి ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాటమరాయుడు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ లో కూడా నిర్మాతగానీ, పవన్ గానీ ఆ ఊసే ఎత్తకపోవడం చాలా విచారకరమని సినీ విమర్శకులు భావిస్తున్నారు. అంత ఉదారత ఉన్న పవన్ నిజంగా సర్దార్ గబ్బర్ సింగ్ ద్వారా నష్టపోయిన వారికి తాను ఏదో విధంగా సాయం చేస్తానన్న భరోసా కూడా కల్పించకపోవడం అనేది ఆలోచించదగ్గ విషయం.
ఇకపోతే ‘కాటమరాయుడు’ చిత్రానికి దర్శకుడుగా డాలీ రాక ముందే బౌండెడ్ స్క్రిప్టు సిద్ధమైపోయింది. ఈ చిత్రానికి గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ కథలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని కూడా తెలుస్తుంది. ఈ చిత్రానికి మొదట దర్శకుడు ఎస్.జె.సూర్యను అనుకోగా ఆయన కొన్ని రోజులు స్క్రిప్ట్ ను కూడా చూసుకున్నాడు. అయితే ఇది తమిళ హిట్ మూవీ ‘వీరం’కు రీమేక్ అయినా యధావిధిగా కాకుండా తెలుగు నేటివిటీకి తగినట్లుగా చాలా చేర్పులు, మార్పులు చేసి ఓ స్ట్రెయిట్ మూవీలా తెరకెక్కించినట్లు యూనిట్ బృందం నుండి సమాచారం.
మొత్తానికి ఈ చిత్రానికి స్క్రిప్టును ఎస్.జె.సూర్య, డాలీ, మరో రచయిత హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. ఇంకా దర్శకుడు వాసు వర్మతో పాటు వేమారెడ్డి, ఆకుల శివ కూడా కాటమరాయుడు సినిమాకు పని చేశారు. ప్రధానంగా ఈ స్క్రిప్టును సిద్ధం చేయడంలో వీరి ముగ్గురి కష్టం దాగి ఉంది. తర్వాత డాలీ వచ్చి చిన్న చిన్న మార్పులతో కథను నేరుగా సెట్స్ పైకి తీసుకెళ్ళాడు. స్క్రిప్టు అంతా పక్కాగా ఉండటంతో నాలుగు నెలలలోనే సినిమా చేయగలిగాడు దర్శకుడు డాలీ. ఇలా సిద్ధమైన కాటమరాయుడు ఈ నిరాహార దీక్ష చేస్తున్న డిస్టిబ్యూటర్ల సమస్యను అధిగమించి ఈ నెల 24వ తేదీ విడుదలై ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో చూద్దాం.