అద్వానీ రథయాత్ర పుణ్యమా అని బిజెపి రెండు సీట్ల నుంచి ఈ స్థాయికి ఎదగగలిగింది. కాగా రామమందిరం విషయంలో వాజ్‌పేయ్ ప్రభుత్వం పెద్దగా కఠిన నిర్ణయం తీసుకోలేదు. వారికి సరైన మెజార్టీ లేకపోవడం కూడా దీనికి కారణం. మరోపక్క వాజ్‌పేయ్‌ది అతివాది కానందునే ఆయన ఆ విషయాలను పట్టించుకోలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. రామమందిరం అంశంతో ఎదిగిన ఆ పార్టీ ఇక దానిని మర్చిపోయి, మోదీ నాయకత్వంలో అవినీతి నిర్మూలన, దేశప్రగతి అనే అంశాలనే ఎక్కువగా ఫోకస్ చేస్తోందనే వాదన వినిపిస్తున్న నేపధ్యంలో మరోసారి అయోధ్య విషయం తెరపైకి వచ్చింది.
దేశ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ విషయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా కూడా మోదీ సర్కార్ ఆ దిశగానే మౌనంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా సుబ్రహ్మణ్యస్వామితో పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విషయం బాగా వైరల్‌గా మారింది. ప్రస్తుతం బిజెపికి లోక్‌సభలో పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో దానికి పూర్తి మెజార్టీ లేదు. కానీ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మంచి విజయం సాధించడంతో త్వరలోనే బిజెపికి సొంతగా రాజ్యసభలో కూడా మెజార్టీ లభించే అవకాశాలున్నాయి. ఈ నేపద్యంలో రామమందిరం విషయంలో కోర్టు పరిధిలో గానీ, లేదా బయట గానీ సమస్యలను పరిష్కరించుకునేందుకు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకే సమయం ఉందని, ఆలోపు ఈ సమస్యపై నిర్ణయం తీసుకోవాలని సుబ్రహ్మణ్యస్వామి ముస్లిం నాయకులకు, మత పెద్దలకు సూచించారు.
కానీ ముస్లిం నాయకులు, వామపక్షాలు వంటివి మాత్రం సమస్య బయట పరిష్కారం అయ్యే అవకాశాలు ఇకలేవని, తీర్పు చెప్పాల్సిన బాధ్యత ఇక సుప్రీం కోర్టుదేనని వాదిస్తున్నారు. ఈ సమస్యకు సరైన పరిష్కారాన్ని సూచించి, ఏదో విషయంలో ముస్లిం మతపెద్దలు, నాయకులు ముందుకు రాని పక్షంలో రామమందిరంపై మోదీ ప్రభుత్వమే ఓ చట్టాన్ని తీసుకొచ్చి, ఆమోదింపజేసుకునే అవకాశం ఉందని, త్వరలో అన్ని సక్రమంగా జరిగి అద్వానీ రాష్ట్రపతి అయితే మాత్రం ఆయన చేతుల మీదుగానే అయోధ్య సమస్యను పరిష్కరించి, తన గురువు అద్వానీకి మోదీ గురుదక్షిణ ఇవ్వనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి.