బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. బాలకృష్ణ, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి అగ్ర నటులతో చేసిన బోయపాటి ఏ ఇమేజ్ లేని బెల్లంకొండతో సినిమా చేయడం అన్నదే ఇప్పుడు పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. అయితే దానికి తోడు ఇప్పుడు మరో హాట్ న్యూస్ బయటకు వస్తుంది. అదేంటంటే.. ఈ చిత్రంలో బోయపాటి చాలా మంది క్రేజీస్టార్స్ ను కూడా తెచ్చి ఆయా పాత్రలతో సినిమాను రంజింప చేసుకొనేందుకు కావాల్సిన టూల్స్ ను అందిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఆ విధంగా బెల్లంకొండ ప్రాజెక్టుకు ఎక్కువ క్రేజ్ ను తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అందరూ భావిస్తున్నదేంటంటే... అంతమంది క్రేజీ స్టార్స్ ను ఆ చిత్రంలో పెట్టడంతో హీరో పలచబడి పోతాడేమోనని, ఆ విధంగా బెల్లంకొండ ఈసారి కూడా హీరోయిజం ప్రదర్శనలో తేడా వస్తుందేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సినీ వర్గాలు.
అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలోని ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్‌లే అయినప్పటికీ... ఇంకా మొత్తం ప్రముఖులైన ఆరుగురు హీరోలు, ఆరుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ కాకుండానే ఈ చిత్రంలో... జగపతి బాబు, శరత్ కుమార్, సుమన్ వంటి ఇదివరకటి హీరోలు, నందు, శశాంక్, మరొకరు ఇప్పటి హీరోలు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే... రకుల్ పాప కాకుండా ప్రగ్యా జైశ్వాల్ మరో కథానాయిక కాగా, కేథరిన్ థ్రెసా ఒక ఐటెం సాంగ్ చేస్తుంది. ఇంకా...మరో నటి ఎస్తేర్‌కు, వాణీ విశ్వనాథ్, సితారకు కూడా ఆయా రోల్స్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇంతమంది మధ్యలో బెల్లంకొండ ఎలాంటి రోల్ ని పోషిస్తున్నాడో అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే ఆ క్రేజీ స్టార్స్ అంతా ఒకే సినిమాకు పనిచేయడం అంటే అందరికీ భారీస్థాయిలో పారితోషికాలు ముట్టినట్లు తెలుస్తుంది. అయితే ఈ చిత్రానికి నిర్మాతగా మిర్యాల రవీందర్ రెడ్డి పేరు పెడుతున్నప్పటికీ... డబ్బుమాత్రం బెల్లంకొండనే ఇస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా అయినా బెల్లంకొండకు వర్క్ అవుట్ అవుతుందేమో చూద్దాం.