ఒకప్పుడు సంగీత దర్శకులంటే సంగీతానికి చెందిన అన్ని విభాగాల్లో నిష్ణాతులైన తర్వాతే సినిమా రంగంలోకి వచ్చేవారు. కె.వి.మహదేవన్, ఇళయరాజా నుంచి చక్రవర్తి, రమేష్ నాయుడు వంటి ఎందరో పాటలను రాసి ట్యూన్ చేయమన్నా, లేక ట్యూన్ ఇవ్వండి దానికి తగ్గట్లుగా లిరిక్ రాసుకొంటాం.. అన్నా కూడా దేనికైనా సిద్దంగా ఉండేవారు. ఇక సంగీత బాణీల విషయంలో పాటల నుంచి రీరికార్డింగ్ వరకు అన్నీ సరిగా చూసుకునేవారు. కె.వి మహదేవన్ వంటి వారు అన్ని తెలిసినా కూడా పుహళేంది వంటి అసిస్టెంట్లను పెట్టుకుని గౌరవించేవారు. పుహళేంది వంటి వారు కూడా తమ గురువులు ఉన్నంతకాలం సొంతగా అవకాశాలు వచ్చినా కూడా సొంతంగా చిత్రాలు చేసేవారు కాదు.
కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. మిడిమిడి జ్ఞానం ఉన్న వారు, హాఫ్ నాలెడ్జీ ఉన్నవారు ఎక్కువైపోయారు. అన్ని విభాగాల్లోనూ ఇదే పరిస్థితి. రాజ్-కోటిలు ఇద్దరు కలిసి సంగీత ద్వయంగా పనిచేశారు. వాస్తవానికి ఇద్దరిలో కోటి పాటల ట్యూన్స్ బాగా ఇచ్చేవాడు. రాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇరగదీసేవాడు. కాబట్టే ఆ జోడీ మహామహులతో పోటీ పడింది. కానీ ఇగో ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఇద్దరు విడిపోయి ఇద్దరు తమ కెరీర్‌ను నాశనం చేసుకున్నారు.
ఇక ప్రస్తుత సంగీత దర్శకుల విషయానికి వస్తే కీరవాణి సవ్యసాచి అయినప్పటికీ సంగీతం విషయంలో తన కజిన్ కళ్యాణిమాలిక్ సహాయం తీసుకుంటాడు. మణిశర్మ ఆర్.ఆర్. అద్భుతంగా ఇస్తాడు. తమన్ కూడా అంతే. కానీ వీరు మంచి పాటల ట్యూన్స్ ఇవ్వడంలో నిష్టాతులు కాలేకపోయారు. దేవిశ్రీ ఒక్కడే రెండు విభాగాలలోనూ పేరు తెచ్చుకున్నాడు. 'కాటమరాయుడు'లో అనూప్‌రూబెన్స్ అందించిన ఆర్.ఆర్ విషయంలో విమర్శలు వస్తున్నాయి.దీంతో మన సంగీత దర్శకులు కూడా బాలీవుడ్ తరహాలో ద్వయాలుగా, త్రయాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి పనిచేస్తే బాగుంటుందేమో అనే అభిప్రాయం వెలువడుతోంది.