మెగాహీరోలంటే కేవలం డ్యాన్స్‌లు, ఫైట్స్‌ని నమ్ముకుని మాస్ ప్రేక్షకులను, మెగాభిమానులను ఆకర్షించే ఫార్ములాలను, కమర్షియల్ హిట్ కంటెంట్‌ను మాత్రమే నమ్ముకుంటారనే చెడ్దపేరు ఉంది. ఇక చిరంజీవి 'రుద్రవీణ, స్వయంకృషి, ఆరాధన, ఆపద్బాంధవుడు' వంటి చిత్రాలలో నటించి నటునిగా మెప్పించినా కూడా ఆయన అభిమానులు పెదవి విరిచారు. దాంతోనే ఆ నెగటివ్ టాక్ సామాన్య ప్రేక్షకులపై పడింది.
కానీ అదే చిరంజీవి తన కెరీర్ మొదట్లో చేసిన అనేక హిట్ చిత్రాలలోని వైవిధ్యపాత్రలు, నెగటివ్ రోల్స్, 'పున్నమినాగు' వంటి చిత్రాలు అందరినీ ఆకట్టుకున్న విషయం మరవరాదు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లుగా, ఆయా చిరు నటించిన వైవిధ్యభరితమైన చిత్రాలు ఆడకపోవడానికి కూడా ఎన్నో కారణాలున్నాయి. ఇక పవన్ చేసిన 'జానీ' కూడా ఫ్లాప్ అయింది. దాంతో మెగాహీరోలు మాస్ ఎలిమెంట్స్‌ను నమ్ముకుంటున్నారు.
ఎలాంటి చిత్రమైనా దానిలో కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేస్తున్నారు. ఇది వ్యాపారం కాబట్టి అది కూడా తప్పుకాదు. కానీ సాయిధరమ్‌తేజ్ వంటి హీరోలు కూడా కెరీర్ ప్రారంభం నుంచే అదే రూటును ఫాలో అవుతూ, మామలను అనుసరిస్తూ, క్రేజ్ తెచ్చుకుంటున్నారు. కానీ వరుణ్‌తేజ్ మాత్రం విభిన్న చిత్రాలు చేయాలని తపిస్తున్నాడు. 'ముకుందా, కంచె' చిత్రాలలో వైవిధ్యభరితమైన నటనను చూపించాడు. 'లోఫర్' వంటి పక్కా మాస్ చిత్రం ఫ్లాప్ అయింది. దాంతో పాత కథే అయినా కథనం కొత్తగా ఉందని భావించి 'మిస్టర్' చేస్తున్నానన్నాడు.
మరోవైపు శేఖర్‌కమ్ములతో 'ఫిదా' చేస్తున్నాడు. ఆయన తెరపైనే కాకుండా తెర బయట కూడా తన మాటలతో తనలోని మనస్తత్వాన్ని ఆకర్షిస్తున్నాడు. అభిమానులు హీరోలకు సపోర్టే గానీ సినిమా అనేది అందరి హీరోల అభిమానులు, సామాన్య ప్రేక్షకులను కూడా మెప్పించాలని, 100కోట్లు సంపాదిస్తున్న చిత్రాలన్నీ ఆ విధమేనని చెప్పాడు. ఇవి మెగాభిమానులకు రుచించకపోయినా కూడా ఆయన చెప్పిన మాట అక్షరాలా వాస్తవం...!