అభిమానులు, ప్రేక్షకులు, వీక్షకులు, సినీ ప్రేమికులు, క్రీడా ప్రేమికులు.. ఇలా ఎవరు లేకపోయినా ఎంతటి గొప్పవారైనా జీరోలే అవుతారు. ప్రజల ఆదరణ ఉంటేనే వారు హీరోలుగా నిలుస్తారు. అది సచిన్ అయినా చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, రామ్‌చరణ్ నుంచి అందరికీ వర్తిస్తుంది. కళాభిమానులు, పోషకులు లేకపోతే కనీస గుర్తింపు కూడా లేక టాలెంటే నిరుపయోగం అవుతుంది. ఇక ప్రజల్లో గుర్తింపు తెచ్చుకోవడం అందరూ అనుకున్నంత ఈజీ కాదు.
దానికి కఠోరశ్రమ, టాలెంట్‌తో పాటు పూర్వజన్మ సుకృతం కూడా ఉండాలి. ఇదంతా ఎందుకంటే.. క్రీడాప్రపంచంలో సచిన్‌టెండూల్కర్‌కు విశ్వవాప్తంగా గుర్తింపు ఉంది. ఆయనంటే పడిచచ్చే ప్రేమికులు, అభిమానులు ఉన్నారు. ఆయన్ను క్రికెట్ దేవుడిగా కొలిచేవారున్నారు. తాజాగా సచిన్ ఐపిఎల్ మ్యాచ్ ప్రారంభోత్సవ వేడుక కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈ సందర్భంగా జరిగిన ఓ సంఘటన సోషల్‌మీడియాలో ఎప్పటి నుంచో వైరల్‌గా మారుతూ, జాతీయ మీడియాలో కూడా పతాక శీర్షికలకు ఎక్కింది.
సచిన్ హైదరాబాద్‌లోని ఇరుకురోడ్లపై కారులో హడావుడిగా ప్రయాణం చేస్తున్నాడు. దీనిని కొందరు బైక్ మీద వెళ్లే ఆయన అభిమానులు గమనించి ఆయన కారును ఫాలోఅయ్యారు. కారులోనుంచి సచిన్‌తో సెల్ఫీ తీసుకోవాలని ఆశపడ్డారు. అంతటి గందరగోళంలో కూడా సచిన్ వారిని విసుక్కొని, నిరాశ పరచలేదు.కారులోనుంచి వారికి సెల్ఫీలకు ఫోజులిచ్చి, వారి నుంచి ఇక ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తామని ప్రామిస్ చేయించుకున్నాడు.
మరి మన హీరోలు కారులో వెంబడించారని, సెల్ఫీలకు దిగారని, గోల చేస్తున్నారని ప్రేక్షకుల మీద, అభిమానుల మీద విరుచుకుపడుతూ, భౌతిక దాడులో లేక బూతులో తిడుతున్నారు. అసహనం పెంచుకుంటున్నారు. అది వారికున్న క్రేజ్‌ను తెలియజేస్తుందనే విషయాన్ని మరుస్తున్నారు.దీనిలో కాస్త అభిమానుల ఓవర్‌యాక్షన్ కూడా ఉంటుంది. కానీ సెలబ్రిటీలు సంయమనం కోల్పోరాదు.