మన స్టార్స్‌కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. దీన్ని ఒకప్పుడు ఎందరో నిర్మాతలు క్యాష్ చేసుకునే వారు. కానీ ఇప్పుడు మన స్టార్స్ విషయం చూస్తే మాత్రం ఇది నిజమేననిపిస్తోంది. ఇప్పటికే చిరంజీవి వంటి వారు గీతాఆర్ట్స్‌తో పాటు నాగబాబు అంజనా ఆర్ట్స్‌కు, చరణ్ 'కొణిదెల' బేనర్‌కు కనెక్ట్ అవుతున్నారు. మరోపక్క పవన్ కూడా సొంతగా బేనర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తన అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో 'జై లవ కుశ' చేస్తున్నాడు.
మహేష్ ఇప్పటికే తన సోదరి మంజులకు, తన అన్నయ్య రమేష్‌బాబుకు సినిమాలు చేశాడు. తాజాగా ఆయన కూడా సొంతగా ఓ బేనర్‌ని స్థాపించాడు. ఇక బన్నీకి ఎలాగూ తన తండ్రి గీతాఆర్స్‌లో రెండు బేనర్స్ ఉన్నాయి. కాగా 'ఆరెంజ్' చిత్రంతో ఆర్ధికంగా బాగా దెబ్బతిన్న నాగబాబు అంజనా ఆర్ట్స్‌లో సినిమాలు తీయడం ఆపేశాడు. ఇప్పుడు ఆయన మిగిలిన మెగాఫ్యామిలీ హీరోల డేట్స్‌ని తీసుకుని, దాన్ని మారుధరకు అమ్ముకునే బిజినెస్ చేస్తున్నాడట.
అల్లుఅర్జున్ త్వరలో వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని లగడపాటి శ్రీధర్ నిర్మించనున్నాడు. ఇక లగడపాటి ఇప్పుడు బన్నీ డేట్స్‌ను నాగబాబు నుంచి బ్లాక్‌లో కొనుక్కోవాల్సిందేనని సమాచారం. బన్నీ దగ్గర నుంచి నాగబాబు డేట్స్‌ని ఇతరులకు ఇవ్వడం వల్ల బన్నీకి మంచి రెమ్యూనరేషన్‌తోపాటు నాగబాబుకు కూడా కమిషన్ రూపంలో బాగా లబ్దిచేకూరుతుందని అంటున్నారు.