ప్రజాస్వామ్యంలో ఏదైనా తప్పు ఉంటే ప్రశ్నించడం ముఖ్యం. మన రాజ్యాంగంలో అందుకే దానిని పొందుపరిచారు. కానీ నేటి యువత జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, తప్పులను, అవినీతిని ప్రశ్నించడం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. తప్పు చేసిన వారు ఎంతటి స్థాయి వారైనా, తమపై బలప్రయోగం చేసే అవకాశం ఉన్నా కూడా భయపడకుండా ప్రశ్నించడం నేర్చుకోవాలి. అందుకే పవన్ మొదట తాను ప్రశ్నించడానికే రాజకీయాలలోకి వచ్చానని చెప్పాడు. ఆయన చెప్పింది అక్షరాలా నిజం. కాకపోతే ప్రశ్నించడం కోసమే అయితే పార్టీని పెట్టాల్సిన పనిలేదు.
ఇక విషయానికి వస్తే పవన్ ప్రజలను ప్రశ్నించమని, క్రమశిక్షణతో ఉండాలని చెబుతున్నాడు. కానీ పవన్‌ని, లేదా చిరుని ఎవరైనా ప్రశ్నించినా, తప్పు అని ఎత్తిచూపినా పవన్ మౌనంగానే ఉంటున్నాడు గానీ ఆయన అభిమానులు, మెగాఫ్యాన్స్ మాత్రం తప్పుని తప్పు అని చెబితే అసభ్యంగా మాట్లాడుతూ, నరుకుతాం.. చంపుతాం.. అంటున్నారు. కాబట్టి ముందుగా పవన్ తన అభిమానులను కూడా ప్రశ్నించడం నేర్చుకోమని, విమర్శలను స్వీకరించమని, ఆయన ఫ్యాన్స్ కూడా ఆయనతో ఏదైనా తప్పుంటే ప్రశ్నించాలని, కొన్ని ఆడియో వేడుకల్లో దురుసుగా ప్రవర్తిస్తూ, తనకు చెడ్డపేరు తెస్తున్న వీరాభిమానులను కట్టడి చేయాలని ఆశిద్దాం....!