టీడీపీ సీనియర్‌నేత, ఎమ్మెల్సీ, తాజాగా వ్యవసాయశాఖా మంత్రిగా పదవి చేపట్టిన దురంధరుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. ఇక ఈయన గత కొంతకాలంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తూ వరుస ఓటములు పొందుతున్నాడు. ఇక ప్రజలు తనకు ఓటు వేసే పరిస్థితి లేదని చెప్పి, దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయన జిల్లాలో వైసీపీ, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటంతో దానికి చెక్ చెప్పాలని భావించిన చంద్రబాబు.. రెడ్డి వర్గానికి చెందిన సోమిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చాడు. కేవలం సామాజిక ఎత్తుగడలో భాగంగానే ఆయనకు మంత్రి పదవి లభించిందనేది వాస్తవం.
ఇక ఈయన ఇటీవల చిరు, పవన్‌ల తల్లి అంజనాదేవిని కలిశాడు. ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ.. పవన్‌కళ్యాణ్ ఒక రాజకీయనాయకుడు కాదని, ఆయన కేవలం ఓ ఎమోషనల్ పర్సన్ అని వ్యాఖ్యానించాడు. పవన్ అభిమానుల మద్దతు కోసం పవన్ తల్లిని కలిశాడనే వార్తలు రావడంతో చంద్రబాబు నుంచి మందలింపు వచ్చిన కారణంగానే ఆయన పవన్‌పై ఇలా మాట్లాడాడని అందరికీ అర్థమవుతోంది. ఇంతకీ రాజకీయనాయకుడుకి? ఎమోషనల్ పర్సన్‌కి? ఆయనకు తేడా తెలుసా...! మంచిభావాలున్న ఎమోషనల్ పర్సన్ రాజకీయ నాయకుడు కాడా? కాలేడా? రాజకీయ నాయకులంటే గోడ మీద పిల్లులుగా, ఏ ఎండకా గొడుగు పట్టే వారిగా, భజనపరులుగా ఉండి, ప్రజల్లో గెలవలేక దొడ్డిదారిన మంత్రి కావడమేనా..?
ఇక సోమిరెడ్డి మాట్లాడుతూ, చంద్రబాబుని ఆకాశానికెత్తేశాడు. తనది చంద్రబాబు సిద్దాంతమని తేల్చాడు. ఇక స్వర్గీయ ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న విషయాన్ని, ఆ తేనెతుట్టెను కదిపాడు. స్వర్గీయ ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతిని పెళ్లాడటానికి తాను కారణం కాదని భుజాలు తడుముకున్నాడు. చరిత్ర చెప్పుకోవాలంటే ఎన్టీఆర్‌కి సన్నిహితుడైన స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనే రాజకీయ చాణక్యుని మేనల్లుడు ఇతను. ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిలు వివాహం చేసుకున్న వెంటనే మొదటగా తన సొంత ఇంటికి తీసుకెళ్లి, శోభనం జరిపి, కానుకలిచ్చి, లక్ష్మీపార్వతి భజన చేసిన వారిలో సోమిరెడ్డి ప్రధముడు. మరి ఆయన ఇప్పుడు ఇలా అసందర్భ ప్రేలాపనలు పేలడం ఏమిటి..?