తెలుగు నాట తెలుగు హీరోయిన్లు క్లిక్ కాకపోయినా ఇతర భాషల్లో వారు హవా చాటడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ ఇది హీరోయిన్లకు సెట్ అవుతుందే గానీ హీరోల విషయంలో ఈ ఫార్ములా వర్కౌట్ కాదు. కానీ తెలుగబ్బాయి అయిన విశాల్ ప్రస్తుతం తెలుగులో కంటే తమిళంలోనే బాగా పాపులర్ అయి ముందుకు సాగుతున్నాడు. కాగా ఇప్పుడు విశాల్ బాటలో మరో టాలీవుడ్ యంగ్‌హీరో పయనిస్తున్నాడు.
తన చోటా మామతో తమిళ ఇండస్ట్రీపై, తెలుగుపై మొదటి నుంచి కన్నేసినప్పటికీ తెలుగులో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఆయన తమిళంపై మోజు పెంచుకుంటున్నాడు. ఆ హీరో ఎవరో కాదు... సందీప్‌కిషన్.. ఆయన తమిళంతో పాటు తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించాడు. ఇక తెలుగులో ఆయనకు 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' మినహా మరో మంచి హిట్ లేదు. కానీ తన మామ సాయంతో నిర్మాతలను, దర్శకులను మాత్రం బాగానే పడుతున్నాడు.
ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో 'నక్షత్రం' చేస్తున్నాడు. దీనిపైనే ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఇటీవల ఈ యంగ్‌హీరోకి తమిళంలో మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటీవల తమిళంలో విడుదలైన 'మానగరం' చిత్రం అక్కడ బాగానే ఆడింది. ఇదే చిత్రం తెలుగులో 'నగరం'గా ఆకట్టుకోలేకపోయింది.
ఇక ప్రస్తుతం ఆయన తమిళంలో ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం మంచి దర్శకునిగా తమిళంలో పేరున్న సుశీంద్రన్ దర్శకత్వంలో 'అరం సైదు పళగు' చేస్తున్నాడు. ఈ చిత్రంపై కోలీవుడ్‌లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక సివికుమార్ దర్శకత్వంలో 'మయవన్' చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు బాగా ఆడితే ఈ యంగ్‌హీరో తెలుగు కంటే ముందుగా తమిళంలో బిజీ అవ్వడం ఖాయమంటున్నారు.