ఏ పెద్ద చిత్రమైనా, ఏ స్టార్ చిత్రమైనా ప్రేక్షకుల అభిమానుల వీక్‌నెస్‌లను దోచుకోవడమే. దానికి సూపర్‌స్టార్‌లు, మెగాస్టార్‌లు, పవర్‌స్టార్‌లు, యంగ్‌రెబెల్‌స్టార్‌లు ఎవ్వరూ అతీతం కాదు. ఇటీవల 'కాటమరాయుడు' కే కాదు 'బాహుబలి1' విషయంలో కూడా నిసిగ్గుగా దోపిడీ జరిగింది. థియేటర్ల యజమానులు , డిస్ట్రిబ్యూటర్లు, కొందరు ఫ్యాన్స్ మాఫియాగా తయారై టిక్కెట్లను 30 నుంచి 50శాతం పెంచి అమ్మారు. టిక్కెట్లను బ్లాక్ చేసి బ్లాక్‌లో అమ్ముకున్నారు.
చారిటీ పేరుతో అడ్డదిడ్డంగా దోచుకున్నారు. దీంతో అఖిల భారత సినీ ప్రేక్షకుల వినియోగదారుల సంఘం నుంచే కాకుండా ఎందరి నుండో విమర్శలు వచ్చాయి.దీంతో బెనిఫిట్ షోల రూపంలో జరిగే దోపిడీని హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు అడ్డుకున్నారు. కానీ మిగిలిన అన్ని చోట్లా మాత్రం షరామామూలే. దీనిపై చట్టాలు లేవు.. చట్టుబండలు లేవు. ఇక 'కాటమరాయుడు' తర్వాత ఇప్పుడు 'బాహుబలి-ది కన్‌క్లూజన్' వంతు వచ్చింది.
మరో వారంలో థియేటర్లలో దిగనుంది.సో.. కోట్లాది కలెక్షన్ల రికార్డుల కోసం జరా మామూలే. ఈసారి బయటి వారు దోచుకోవడం ఎంచునుకున్నారేమో గానీ ఈ చిత్ర నిర్మాతలే తాము తెలుగుజాతి గర్విపడే చిత్రాన్ని తీసి, ప్రపంచ యవనిక మీద కీర్తిపటాకాన్ని ఎగురవేస్తున్నామని, భారీబడ్జెట్ చిత్రం కావడంతో అధికారికంగానే టిక్కెట్ల రేట్లను పెంచుకుంటామని, ఇక ఒక రోజులో 5షోలు మించి కూడా వేసుకోవడానికి ప్రభుత్వాల అనుమతి కోరారని సమాచారం. ఇక బాబు, కేసీఆర్‌లు ఆపర 'బాహుబలి' సృష్టికర్తలు. ఒకరేమో బంగారు తెలంగాణ, మరోకరు సెట్టింగ్‌ల అమరావతి సృష్టికర్త. కాబట్టి వారికి పర్మిషన్ ఖాయమైనట్లేనని, ఇక దోచుకోవడమే తరువాయి అంటున్నారు....!