దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు దేశమంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ వస్తువుకైనా తయారు చేసే వారే ధరను నిర్ణయిస్తారు. కానీ రైతుల విషయంలో మాత్రం ప్రభుత్వాలు చెప్పిన ధరకే రైతులు విక్రయించాలి. ఇక అన్నపూర్ణగా పిలవబడే మన దేశంలో రైతుల పరిస్థితి ఇంతగా దిగజారింది. తాజాగా తమిళనాడు రైతులు గత 42రోజులుగా ఢిల్లీలోని ఉండి తమ బాధను వినమని కేంద్ర పెద్దల వద్ద గగ్గోలు పెడుతూ, వినూత్న నిరసనలు తెలుపుతున్నారు.
కాగా నడిఘర్ సంఘానికే కాక నిర్మాతల మండలికి కూడా ఎన్నికైన విశాల్ ఇప్పటికే తన స్టాండ్‌ను ప్రకటించాడు. నిర్మాతలందరూ తమిళనాడులో విడుదలయ్యే చిత్రాల టిక్కెట్‌లోంచి రైతునిధికి 1రూపాయి చెల్లించాలని చెప్పాడు. అప్పట్లో కాస్త నిర్మాతల వైపు నుంచి మద్దతు కరవైనా, ప్రస్తుతం రైతుల ఆందోళన చూసిన నిర్మాతలు దానికి సుముఖంగా ఉన్నారు. మరోవైపు విశాల్‌తో కలిసి గతంలోనే రైతుల సమస్యలపై గళమెత్తిన ప్రకాష్‌రాజ్ కూడా విశాల్‌తో కలిసి డిల్లీ వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ధర్నాలో పాల్గొని రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ఇక స్నేహ దంపతులు 10మంది రైతులకు 2లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. కాగా ప్రతి సినిమా నుండి టిక్కెట్ ద్వారా వసూలు చేసే 1 రూపాయి రైతు నిధిని ఢిల్లీలో ఉండి డబ్బులకు, తిండికి కటకటలాడుతున్న రైతులకు ఖర్చుగా ఇవ్వనున్నారు. కళాకారులంటే సున్నితమనస్కులు. వారు దేనిపైనైనా ఇలాగే స్పందించాలి. కానీ మన వారికి మాత్రం కాస్త చర్మం మందమనే చెప్పాలి...!