హీరోయిన్ అంజలి ఈ మధ్యన హర్రర్ చిత్రాల మీద పడింది. స్టార్ హీరోల పక్కన అవకాశాలు రాక ఇలా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ తో కాలక్షేపం చేస్తుంది. గీతాంజలి చిత్రంతో హర్రర్ కామెడీకి శ్రీకారం చుట్టిన అంజలి తదుపరి చిత్రం చిత్రాంగద లో కూడా ఇలా హర్రర్ యాక్షన్ చేసి జనాల్ని భయపెట్టింది. ఇప్పుడు జనాలు భయపడడం ఏమోగానీ అంజలి దెయ్యాలుకు తెగ భయపడిపోతుందట. వరుసగా దెయ్యాల చిత్రాల్లో నటించడం వలనో మరేదన్న కారణమో తెలియదు గాని ఈ దెయ్యాల భయంతో అంజలి ఉంటున్న ఇంటిని ఖాళీ చేసిందట.
అంజలి గత కొన్ని రోజులుగా హైద్రాబాద్ లో గచ్చిబౌలిలోని ఒక అపార్ట్ మెంట్ లో ఉంటుంది. అయితే అక్కడ ఏవో అతీత శక్తులు ఉన్నట్టు అవి తనని భయపెడుతున్నట్లు నమ్ముతుంది. రాత్రి పూట తన ఇంటి చుట్టూ ఎవరో తురుగుతున్నట్లు... ఏవో విచిత్రమైన శబ్దాలు రావడం వంటివి చాలా కాలం నుండి జరుగుతున్నాయట. వీటన్నిటికీ భయపడిన అంజలి ఇల్లు ఖాళీ చేసి వేరే చోటికి మారిపోయిందట.
ఇల్లు ఖాళీ చెయ్యడమేమో గాని ఇకపై హర్రర్ చిత్రాలలో నటించకూడదని కూడా ఫిక్స్ అయ్యిందట అంజలి. ఇలాంటి భయాలతోనే రెండు మూడు ఆఫర్స్ ని తిరస్కరించిందని చెబుతున్నారు. పాపం అంజలిని దెయ్యాలు బాగానే భయపెట్టాయి.