గత ఏడాది 'పెళ్లి చూపులు' చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా విడుదలై భారీ విజయాన్ని మూటగట్టుకుని విజయకేతనం ఎగురవేసింది. మొదటిసారి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ని సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రశంసల జల్లు కురిపించింది. చిన్న చిత్రంగా విడుదలై భారీ హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ చిత్రం జాతీయ పురస్కారాన్ని అందుకోవడం కూడా సంచలనమే అయ్యింది. 'పెళ్లి చూపులు' విడుదలై చాలా నెలలు గడుస్తున్నా ఆ దర్శకుడు మరో సినిమా చెయ్యలేదు.
ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ తన రెండో సినిమాని పూర్తి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడట. ఆ చిత్రం బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన 'దిల్ చాహత హై' తరహాలో ఉండబోతుందని అంటున్నారు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా వున్న తరుణ్ సినిమా గురించి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి వుంది. మరో పక్క నటీనటుల ఎంపిక జరగలేదట. అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడు మొదలవ్వబోతుందో కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. కానీ తరుణ్ ఈసారి ఒక స్టార్ హీరోతోనే సినిమాకి సిద్ధమవుతున్నాడని అందుకే రెండో సినిమాని మొదలు పెట్టడానికి ఇంత సమయం తీసుకున్నాడని అంటున్నారు.