నడిగర్ సంఘాన్ని, నిర్మాతల మండలిని తన చేతుల్లోకి తెచ్చుకున్న హీరో, నిర్మాత విశాల్ ప్రస్తుతం పైరసీ సీడీలు, ఆన్‌లైన్ పైరసీపై దృష్టి పెట్టాడు. ప్రతి ఏటా పరిశ్రమకు పైరసీ వల్ల 800 నుంచి 1000కోట్లు నష్టం వస్తోందన్నాడు. నిర్మాతలకు రావాల్సిన ఆదాయంలో 80శాతం దీని వల్ల కోల్పోతున్నామని, కేవలం 20శాతం మాత్రమే నిర్మాతలకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. పరిస్థితులు ఇలాగే ఉంటే నిర్మాతలు సినిమాలు తీయడం మానేసి, వేరే వృత్తులు చూసుకోవాల్సివస్తుందన్నాడు.
మరోపక్క తమిళనాడులో నిర్మాతలకు పక్కలో బల్లెంలా మారిన పైరసీ వెబ్‌సైట్ అయిన తమిళరాకర్స్‌ని ఆయన ఎండగట్టాడు. వారి అంతు తేలుస్తామన్నాడు. అయినా ఓ చిత్రం పైరసీకి గురి కావడానికి ఎక్కువగా ఇంటి దొంగలే కారణం. వారిపై దృష్టి పెట్టకుండా, తమలోని లోపాలను సవరించుకోకుండా ఆయన దూకుడుగా ముందుకు వెళ్లడం అనుభవరాహిత్యమేనని చెప్పవచ్చు. మరోపక్క ఆయన ఇది కేవలం తమ ఒక్కరి వల్ల జరిగే పని కాదని ఆలస్యంగా గ్రహించాడు.
దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో కఠిన చట్టాలు తీసుకొని రావాలని, తమకు సహకరించాలని కోరాడు. ప్రభుత్వాలు అనుమతిలేని అశ్లీల వెబ్‌సైట్స్‌పై ఉక్కుపాదం మోపినట్లుగానే, ఆన్‌లైన్ పైరసీని చేసే వెబ్‌సైట్లపై సైతం చర్యలు తీసుకోవాలన్నాడు. ఇక తమ సమస్యలు పరిష్కరించకపోతే తాము మే 30వ తేదీ నుంచి సినిమాలు తీయమని ప్రకటించాడు. మరి ఆయనతో మిగిలిన నిర్మాతలు, హీరోలు కలిసి వస్తారో రారో ముందుగా ఆయన తెలుసుకుంటే మంచిది...!