'ఓరి బ్రహ్మదేవుడో..' అంటూ పాటను ప్రారంభించి శ్రీదేవి అందాన్ని అద్భుతంగా వర్ణించారు ఓ కవి. ఇప్పటికీ ఎప్పటికీ అతిలోక సుందరి అంటే శ్రీదేవే గుర్తుకువస్తుంది. ఇక వయసు అనేది కాల ప్రవాహం. ఎవరి కోసం అది ఆగదు. వయసుతో పాటు ఎంతటి సౌందర్యవంతులైనా కాలగమనంలో ముసలివారై... అంద విహీనంగా మారడం దేవుని సృష్టి. దానికి ఎవ్వరూ అతీతులు కారు. ఇక శ్రీదేవి మరలా రీఎంట్రీ ఇస్తోందని తెలిసి దేశవ్యాప్తంగా ఉన్న సౌందర్యప్రియులు ఎంతో ఆనందించారు.
ఆమె నటించిన 'ఇంగ్లీషు.. వింగ్లీషు' చిత్రం మంచి విజయం సాధించింది. కానీ ఆ చిత్ర విజయంలో శ్రీదేవి అందం కన్నా.. ఆమె చూపిన టాలెంటే హైలైట్ అయింది. అందులోని కొన్ని సీన్స్‌లో ఆమె వయసు మీరి కనిపించి తన అభిమానులను నిరాశపరిచింది. ఇక ఆ తర్వాత 'బాహుబలి' చిత్రంలోని శివగామి పాత్ర తన వద్దకు వచ్చినా పోగొట్టుకుంది. చివరకు ఆ పాత్ర రమ్యకృష్ణను వరించింది. 'నరసింహా'లోని నీలాంబరి పాత్రను మించిన కీర్తిని ఈ పాత్ర రమ్యకృష్ణకి సంపాదించిపెట్టి, ఆమె లేకపోతే ఆ పాత్రే లేదోమోనన్నట్లుగా మైమరిపించింది.
కానీ ఈ మద్యలో శ్రీదేవి మరో పిచ్చినిర్ణయం తీసుకుంది. ఏరికోరి విజయ్ నటించిన 'పులి' చిత్రంలోని పాత్రను చేసింది. ఇది ఆమెను, ఆమె ఫ్యాన్స్‌ని తీవ్రంగా నిరాశపరిచింది. ఓవర్‌మేకప్‌తో భయపెట్టింది. ఈమెనా మన శ్రీదేవి అనిపించేలా కనిపించింది. తన రీఎంట్రీలో అవకాశాలు బోలెడువస్తున్నా కూడా ఆచితూచి ఆమె చిత్రాలను ఎంపిక చేసుకుంటోంది. అటు వంటి సీనియర్ నటి 'బాహుబలి'ని వదులుకుని, 'పులి'ని చేయడం బాధాకరం.
ఇక తాజాగా ఆమె నటిస్తున్న 'మామ్' చిత్రం ట్రైలర్ విడుదలైంది. నేటి వయసు మీరిన హీరోయిన్లు కూడా తమ అందంతో తమ పిల్లలకు తల్లులుగా కాకుండా అక్కలా కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ 'మామ్' చిత్రం చూస్తే శ్రీదేవి నేటితరం హీరోయిన్లను అమ్మమ్మలా కనిపిస్తోంది. తమ రీఎంట్రీలో మరీకుర్రహీరోయిన్లుగా కాకపోయినా కనీసం ఫర్వాలేదనేలా మాధురిదీక్షిత్, శిల్పాశెట్టి, హేమమాలిని వంటి వారు జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ శ్రీదేవి మాత్రం అలా చేయలేకపోతోంది..!