'బాహుబలి-ది బిగినింగ్' విడుదలయ్యే సమయంలో పెద్ద చిత్రాలే కాదు.. చిన్న చిత్రాలు కూడా దానికి దారిచ్చాయి. కానీ 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం సృష్టిస్తున్న ప్రభంజనం చూసి కూడా కొందరు నిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేసేందుకు ధైర్యం చేయడం చూస్తుంటే ఆశ్యర్యం కలుగుతోంది. మే 5వ తేదీన బాలీవుడ్ అడల్ట్ మూవీ 'హంటర్'కు రీమేక్‌గా శ్రీనివాస్ అవసరాల హీరోగా రూపొందుతున్న 'బాబు బాగా బిజీ' విడుదలకు సిద్దమవుతోంది.
అలాంటి అడల్ట్ కంటెంట్‌తో చిత్రాలు వచ్చి కాస్త గ్యాప్ రావడంతో పాటు ఈ చిత్రం బిజినెస్ బాగా జరగడం, శ్రీముఖి, తేజస్వి వంటి వారి అందాలను చూడాలని సగటు ప్రేక్షకులు ఫీలవుతుండటంతో ఈ చిత్రం విడుదలకు డేర్ చేసింది. వీటితో పాటు ప్రేక్షకుల్లో కాస్త క్యూరియాసిటీని రేకెత్తిస్తున్న 'రక్షకభటుడు', 'వెంకటాపురం' చిత్రాలు కూడా అదే రోజున విడుదలకు సిద్దమవుతున్నాయి. మరోపక్క వరుస వైవిధ్యభరితమైన చిత్రాలతో, నోట్ల రద్దు వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా వచ్చి సంచలనం సృష్టించిన నిఖిల్, తనకు హీరోగా బ్రేక్‌నిచ్చిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో కసితో చేస్తున్న 'కేశవ' చిత్రం కూడా మే 12న విడుదలకానుంది.
మరో వైవిధ్యభరితమైన చిత్రం కావడంతో దీనిపై కూడా ప్రేక్షకులపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక గోపీచంద్ చిత్రం వచ్చి చాలా కాలం అయింది. మినిమం గ్యారంటీ ఉన్న యాక్షన్ హీరోగా ఆయనకు మంచి పేరుంది. ఇక ఈమద్యకాలంలో ఆయన పెద్దగా పూర్తి మాస్ ఓరియంటెడ్ యాక్షన్ చిత్రం చేయలేదు. ఇక కమర్షియల్ అండ్ మాస్ చిత్రాల మాష్టార్ బి.గోపాల్ నుంచి ఓ చిత్రం వచ్చి కూడా చాలాకాలమైంది. అందునా నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటంతో 'ఆరడుగుల బుల్లెట్' పై కూడా మంచి క్యూరియాసిటీ ఉంది. మరి ఈ చిత్రాలు 'బాహుబలి'కి పోటీ కాకపోయినా, ఆ చిత్రం హవా మరో నెల సాగుతుందని తెలుస్తున్న పరిస్థితుల్లో దాని ఓవర్‌ఫ్లోనైనా క్యాష్ చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.