'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్‌లను బద్దలు కొడుతూ, ఇండియాలోనే ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచి మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ నటించిన 'పీకే, దంగల్' రికార్డులను కేవలం 6రోజుల్లో దాటేసింది. ఇక ఈ చిత్రం లాంగ్‌రన్‌లో 1500కోట్లు గ్యారంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
కానీ 'బాహుబలి-ది బిగినింగ్' చిత్రం చైనాలో భారీగా విడుదలైనా తీవ్ర నష్టాలను చవిచూసింది. వాస్తవానికి చైనా ప్రేక్షకులు 'బాహుబలి' వంటి వివిధ దేశాల పీరియాడికల్ మూవీస్‌ను బాగా ఆదరిస్తారు. దాంతో 'బాహుబలి 1' చైనాలో కూడా మంచికలెక్షన్లు వసూలు చేస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా 'బాహుబలి 1'ని చైనీయులు రిజెక్ట్ చేశారు. అదే సమయంలో అమీర్ నటించిన 'పీకే' చిత్రాన్ని బ్రహ్మాండంగా ఆదరించారు. 4వేల స్క్రీన్లలో చైనాలో విడుదలైన ఈ చిత్రం 100కోట్లకు పైగానే వసూలు చేసింది.
కాగా ఇప్పుడు 'బాహుబలి 1' ఇచ్చిన షాక్‌తో 'బాహుబలి-ది కన్‌క్లూజన్'ను చైనాలో విడుదల చేయాలా? వద్దా? అనే మీమాంసలో బాహుబలి నిర్మాతలు ఉన్నారు. ఇదే సమయంలో అమీర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆయన తాను నటించిన 'దంగల్' చిత్రాన్ని నిన్న అంటే మే 5వ తేదీన చైనాలో ఏకంగా 9వేల స్క్రీన్లలో రిలీజ్ చేశారు. అంటే 'బాహుబలి2' ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్క్రీన్ల కంటే ఇది ఎక్కువ.
ఈ చిత్రం ప్రమోషన్ కోసం అమీర్ ఈమధ్య స్వయంగా చైనాలో పర్యటించాడు. అక్కడ 'దంగల్' చిత్రం 'ష్యూ జియో బాబా' పేరుతో విడుదలైంది. దీని అర్ధం 'కుస్తీ పడుదామా నాన్నా...'. మరి నోట్ల రద్దు సమయంలో వచ్చి చరిత్రను తిరగరాసిన 'దంగల్' చిత్రం చైనాలో ఎలాంటి ఫలితాలను సాధిస్తుందో వేచిచూడాల్సివుంది...!