1990లలో ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులను కూడా అలరించి, యువతకు నిద్ర పట్టకుండా చేసిన అందగత్తె మనీషా కోయిరాల. ఉత్తరాది హీరోయిన్లు దక్షిణాది చిత్రాలలో నటించడానికి వెనుకాడుతున్న స్థితిలో ఆమె ధైర్యం చేసి పలు దక్షిణాది చిత్రాలలో నటించింది. నాగార్జునతో 'క్రిమినల్', కమల్‌హాసన్‌తో 'భారతీయుడు', అర్జున్‌తో 'ఒకే ఒక్కడు'. అరవింద్‌స్వామితో 'బొంబాయి' చిత్రాలలో ఆమె నటనతో పాటు అందంతోనూ మెప్పించింది.
ఇక దక్షిణాదికి చెందిన టాప్ డైరెక్టర్లయిన మణిరత్నం, శంకర్‌ల ఫస్ట్ చాయిస్ ఆమేనంటే అతిశయోక్తికాదు. కాగా ఆమె ఆ మధ్య పెళ్లిచేసుకుంది. విడాకులు కూడా తీసుకుంది. అప్పుడే ఆమెకు క్యాన్సర్ వచ్చింది. దీంతో నరకయాతన పడింది. సినిమాలల్లో తాను టాప్‌స్టార్స్‌తో చేసినా కూడా సినిమా వారెవ్వరూ తాను క్యాన్సర్‌తో బాధపడేటప్పుడు డబ్బులు సరే, కనీసం తనకు ధైర్యం కూడా చెప్పలేదని వాపోయింది.
తాజాగా ఆమె 'డియర్ మాయా' చిత్రంలో నటిస్తోంది. అసలే క్యాన్సర్ వల్ల ఆమె గ్లామర్ పోయింది. ఇక ఈ చిత్రం కోసం ఆమె మరింత డీగ్లామరైజ్‌గా కనిపిస్తోంది. వయసు మళ్లిన ఓ మహిళ కథగా, మంచి సందేశాత్మక చిత్రంలో నటిస్తోంది. మృత్యువును జయించిన ఆమెకు నిజజీవితంలోనే కాదు సినిమా రంగంలో కూడా ఇది పునర్జన్మేనని చెప్పవచ్చు.