కళ.. డబ్బుల కోసం కాదు.. ప్రజల కోసం అని నమ్మే లోకనాయకుడు కమల్‌హాసన్. ఆయన గట్స్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక 'విశ్వరూపం' వంటి చిత్రాన్ని ఆయనే స్వయంగా నిర్మించి, నటించి, దర్శకత్వం వహించాడంటే ఎంత సాహసమో చెప్పనవసరం లేదు. కాగా ఆయన 55ఏళ్ల కెరీర్‌లో 'విశ్వరూపం' చిత్రానికి ఆయన పడిన బాధ మరే చిత్రానికి పడలేదనేది కూడా వాస్తవం. వాస్తవానికి ఈ చిత్రంలో ఏముందో తెలియకపోయినా కొన్ని వర్గాలు ఆయనపై, ఆయన చిత్రంపై అభ్యంతరాలు లేవనెత్తాయి. ఈ చిత్రం టైటిల్‌ను ఆయన తెలుగు, తమిళంలోనే కాకుండా ఉర్దూ, అరబిక్ భాషల్లో డిజైన్ చేయడంతో ముస్లింలు ఆ చిత్రంలో తమను అవమానపరిచే సన్నివేశాలున్నాయంటూ రోడ్డెక్కారు. ప్రభుత్వాలు కూడా సినిమాలో ఏముందో కూడా తెలియకుండానే సినిమాను విడుదల కానీయమంటూ ప్రకటనలు చేశాయి.
తాజాగా ఈ విషయంపై కమల్ స్పందిస్తూ 'మిగిలిన రాష్ట్రాల వారు కూడా ఈ చిత్రాన్ని బ్యాన్ చేస్తామని చెప్పినప్పటికీ రిలీజ్ చేశాయి. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం విడుదలను అడ్డుకుంది. నేను 'హేరామ్' చిత్రం తీసేటప్పుడు హిందువులు నన్ను హిందూ వ్యతిరేకి అన్నారు. 'విశ్వరూపం' సమయంలో ముస్లిం వ్యతిరేకి అన్నారు. చాలా బాధ వేసింది. అప్పుడు కాషాయం హర్టయితే..ఇప్పుడు పచ్చరంగు హర్ట్ అయింది. నా వరకు భారతీయులందరూ ఒకటే. నేను మతపరంగా ఎవ్వరినీ చూడను. అందరం భారతీయులం. టెర్రరిజంకు వ్యతిరేకంగా నాపోరాటం కొనసాగుతుంది' అని స్పష్టం చేశాడు. ఇక 'విశ్వరూపం2' ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో కూడా జాతీయ జెండాను హృదయానికి హత్తుకునేలా చూపించాడు. దీంతో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ చిత్రంలో అలనాటి నటి వహీదా రెహ్మాన్ కమల్ తల్లిగా, నాట్యకళాకారిణిగా కనిపించనుంది.