ఏపీలో బిజెపి, టిడిపిలు కలిసి పోటీ చేయడం.. చంద్రబాబు మాత్రమే రాజధాని కూడా లేక, లోటుబడ్జెట్‌లో ఉన్న ప్రత్యేక ఏపీని ముందుకు నడిపించగలడనే నమ్మకం, మోదీ హవా...వీరికి పవన్ మద్దతు తెలపడం వంటి వాటి వల్ల ఏపీలో టిడిపి అధికారంలోకి రాగలిగింది. కానీ ఇప్పుడు రాజకీయ సమీకరణాలు మారేలా ఉన్నాయి. తాజాగా చంద్రబాబు, వెంకయ్యనాయుడులు కూడా వచ్చే ఎన్నికల్లో తమ ఇద్దరి మధ్య పొత్తు ఉంటుందని చెప్పారు. బిజెపి అధిష్టానం కూడా కాస్త ఆ వైపుగానే మొగ్గు ఉంది.
కానీ తాజాగా బిజెపి నాయకుడు కన్నాలక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. వెంకయ్య తమ ఇద్దరి మధ్య పొత్తు ఉంటుందని చెప్పాడని, కానీ అమిత్‌షా త్వరలో తెలుగు రాష్ట్రాలలో పర్యటించనున్నందు వల్ల ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అని వేచిచూస్తున్నామన్నారు. కన్నాతో పాటు పురందేశ్వరి, సోము వీర్రాజు వంటి వారు కూడా వచ్చే ఎన్నికల్లో టిడిపితో పొత్తు లేకుండా బిజెపి సొంతగా పోటీ చేయాలని సూచిస్తున్నారు.
అధిష్టానం బాబుపట్ల, టిడిపి పట్ల సానుకూలంగానే ఉన్నప్పటికీ స్థానిక నాయకులు, కార్యకర్తలు మాత్రం బాబుతో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు జనసేన వామపక్షాలతో కలిసే అవకాశం కనిపిస్తోంది. మరి బిజెపి హ్యాండ్ ఇస్తే ఏపీలో బాబు పరిస్థితి ఏమిటి? ఆయనతో ఎవరు కలుస్తారు? అనేది చర్చనీయాంశం అయింది.