రాజమౌళి సృష్టించిన 'బాహుబలి ద కంక్లూజన్' ఏప్రిల్ 28 న విడుదలైన దగ్గర నుండి బాక్సాఫీస్ దుమ్ముదులుపుతూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రాన్ని మొదటిరోజు వీక్షించిన చాలా మంది ఇండస్ట్రీ ప్రముఖులు రాజమౌళి మరియు బాహుబలి టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. కొందరు స్వయంగా ఫోన్ చేసి విష్ చేస్తే మరికొందరు సోషల్ మీడియాలో బాహుబలి టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఒక్క టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాకుండా కోలీవుడ్, బాలీవుడ్ వారు కూడా రాజమౌళిని ప్రశంసించారు. ఇక వీరందరికి రాజమౌళి పేరు పేరునా కృతజ్ఞత కూడా తెలిపాడు అది వేరే విషయం. ఇంకా బాహుబలి విడుదలై ఇన్నిరోజులవుతున్నప్పటికీ ఇప్పటికి రాజమౌళికి విషెస్ అందుతూనే వున్నాయి.
ఇక తాజాగా రాజమౌళిని విష్ చేసిన వారిలో ఒక ప్రముఖ స్టార్ హీరో కమ్ పొలిటీషియన్ కూడా ఉన్నాడు. ఆయనే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో రాజమౌళిని, ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తాడు. బాహుబలి-2 చిత్రం 1000 కోట్ల క్లబ్ ని సృష్టించిన సందర్భంగా పవన్... రాజమౌళి, ప్రభాస్ లకు అభినందనలు తెలిపాడు. పట్టుదలతో బాహుబలిని తెరకెక్కించి తెలుగువాడు గర్వపడేలా చేసిన రాజమౌళికి విషెస్ తెలిపాడు. అలాగే పవన్... శ్రీ రాజమౌళి, శ్రీ ప్రభాస్ అంటూ ఎంతో గౌరవంతో వారిరువురికి శుభాకాంక్షలు తెలిపాడు. ఒక తెలుగు సినిమా ఇలా ప్రపంచంలో వేయినోళ్ల కొనియాడుతుంటే ఏ సెలెబ్రిటీ మాత్రం పొగడకుండా ఉంటాడు.
మరి మొన్నామధ్యన సూపర్ స్టార్ రజినీకాంత్ బాహుబలి చిత్రాన్ని వీక్షించి రాజమౌళి అండ్ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపినప్పుడు ఎంతో ఉప్పొంగిపోయిన జక్కన్న ఇప్పుడు పవన్ ప్రశంసలకు కూడా సంతోషంతో వెంటనే రిప్లయ్ ఇచ్చాడు.