ఆయన సినిమా రంగంలోకి వచ్చి చాలా ఏళ్లయింది. కేవలం 'ప్రస్థానం'తోనే ఆయనకు గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు 25 చిత్రాలు చేశాడు. అతడే కుర్రహీరో శర్వానంద్. మంచి టాలెంట్ ఉన్న నటునిగా పేరు వచ్చినప్పటికీ ఆయనకు బ్రేక్‌నిచ్చిన చిత్రం 'రన్ రాజా రన్'. ఇక అక్కడి నుంచి ఈ కుర్రహీరో దూసుకుపోతున్నాడు. 'ఎక్స్‌ప్రెస్ రాజా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు'లతో పాటు దిల్‌రాజు-సతీష్‌వేగ్నేష్‌ల కాంబినేషన్‌లో ఆయన చేసిన 'శతమానం భవతి'తో ఆయన భారీ పోటీని ఎదుర్కొని తన సినిమా తీసిన నిర్మాతలకు, బయ్యర్లకు రెండు మూడు రెట్లు లాభాలు తెచ్చిపెట్టాడు.
30కోట్ల మార్కును అందుకోవడమే కాదు.. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా వచ్చింది. ఇక రేపు ఆయన బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ అనే భారీ నిర్మాత నిర్మాణంలో చంద్రమోహన్ అనే కొత్త దర్శకునితో చేసిన ఎంటర్‌టైనర్ 'రాదా' విడుదలకానుంది. మరోవైపు శర్వానంద్ ఇంతకాలం దర్శకులతో ప్రయోగాలు చేసినా కూడా నిర్మాతలుగా మాత్రం యువి క్రియేషన్స్, దిల్‌రాజు, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కె.ఎస్.రామారావు వంటి వారితోనే చిత్రాలు చేశాడు. ఇప్పుడు ఆయన నిర్మాత, కథలతో పాటు దర్శకులపై కూడా దృష్టి పెట్టినట్లు అర్ధమవుతోంది.
యువి క్రియేషన్స్ బేనర్‌లోనే 'భలే భలే మగాడివోయ్' తరహాలో మారుతి దర్శకత్వంలోనే 'మహానుబాహుడు' చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ కూడా సగానికి పైగా పూర్తయింది. ఇక నిఖిల్‌కు హీరోగా 'స్వామిరా..రా'తో బ్రేక్‌నిచ్చి, వచ్చే వారం విడుదలకు సిద్దమవుతోన్న 'కేశవ'కు దర్శకత్వం వహిస్తున్న సుధీర్ వర్మకు ఓకే చెప్పాడు. ఇక నాగార్జున, ప్రభాస్ వంటి వారికి పెద్ద హిట్లిచ్చిన ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు దశరథ్‌తో కూడా ఆయన నటించే అవకాశాలున్నాయి. మొత్తానికి ఇప్పుడు నిర్మాతలు, కథలతో పాటు హీరోగా నానికి పోటీగా ఎదగడానికి దర్శకుల ఎంపికలో కూడా శర్వా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడనే చెప్పాలి.