తన కుమారుడు రాజమౌళి తీసిన అన్ని చిత్రాలకు తిరుగులేని కథలు రాసిన రచయిత విజయేంద్రప్రసాద్. ఇక 'బాహుబలి-ది బిగినింగ్, భజరంగీభాయిజాన్, బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రాలతో ఈయన దేశంలోనే స్టార్ రైటర్ అయిపోయాడు. ఇక ప్రస్తుతం విజయ్ హీరోగా నటిస్తున్న ఓ తమిళ చిత్రానికి, క్రిష్ దర్శకత్వంలో కంగనారౌనత్ నటిస్తున్న 'మణికర్ణిక' చిత్రాలకు ఆయనే కథను అందించారు.
కాగా ఈ స్టార్‌రైటర్ తాజాగా మాట్లాడుతూ, పవన్‌కళ్యాణ్ నిజాయితీ, వ్యక్తిత్వం అంటే నాకెంతో ఇష్టం. ఆయన నిజాయితీ, వ్యక్తిత్వంలతోనే ఓ పవర్‌ఫుల్ కథను రాయగలను. ఆయన కోసం నేను ఖచ్చితంగా కథను రాస్తాను. బహుశా పవన్ కోసం త్వరలోనే ఓ కథను రాస్తానేమో అంటూ ఆయన హింట్ ఇచ్చాడు. ఇక 'బాహుబలి- ది కన్‌క్లూజన్' చిత్రంలోని ఇంటర్వెల్ బ్యాంగ్‌ను పవన్ స్ఫూర్తితోనే తానా సీన్‌ను తయారు చేశానని గతంలోనే విజయేంద్రప్రసాద్ తెలిపిన విషయం తెలిసిందే.
కాగా ఇంతకాలం కేవలం తన రాజమౌళి చిత్రాలకు, తనకు మాత్రమే కథలను రాసుకున్న విజయేంద్రప్రసాద్, సల్మాన్- కబీర్‌ఖాన్‌ల కోసం 'భజరంగీ భాయిజాన్', విజయ్ చిత్రం, ఇప్పుడు క్రిష్ చిత్రానికి కథ రాయడంతో త్వరలో రాజమౌళి దర్శకత్వం వహించినా లేకపోయినా ఇతర దర్శకులకు పవన్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను రాస్తాడని ఆయన అభిమానులు ఆనందపడుతున్నారు.