టాలీవుడ్ లో నాని కి మాదిరిగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటూ వరస విజయాలతో దూసుకుపోతున్నాడు రాజ్ తరుణ్. మంచి కథలను ఎంపిక చేసుకుంటూ హిట్స్ కొడుతున్న రాజ్ తరుణ్ అప్పుడెప్పుడో శతమానం భవతి చిత్రాన్ని మిస్ చేసుకున్నాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ చేతిలోని ఆ ప్రాజెక్ట్ శర్వానంద్ కి వెళ్లడంతో అతను ఆ సినిమాలో నటించి హిట్ కొట్టాడని అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. అయితే దిల్ రాజుకి మాత్రం రాజ్ తరుణ్ తో ఎప్పటి నుండో సినిమా చెయ్యాలని కోరిక. అందుకోసమే రాజ్ తరుణ్ కోసం శతమానం భవతి కథని సిద్ధం కూడా చేశాడు. కారణం తెలియదు కానీ రాజ్ తరుణ్ ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని వార్తలొచ్చాయి.
అయితే దిల్ రాజు మనసులోని కోరిక ఇప్పుడు తీరబోతుందట. రాజ్ తరుణ్ హీరోగా అనీష్ కృష్ణ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా నిర్మిచబోతున్నాడట దిల్ రాజు. ఇప్పటికే రాజ్ తరుణ్ కి దర్శకుడు కథ వినిపించడం రాజ్ తరుణ్ ఒకే చెయ్యడం జరిగిపోయాయని చెబుతున్నారు. అలాగే ఇపుడు రాజ్ తరుణ్ నటించిన అంధగాడు సినిమా విడుదల కాగానే రాజ్ తరుణ్.. దిల్ రాజు నిర్మాతగా నిర్మించబోయే చిత్రానికి షిఫ్ట్ అవుతాడని అంటున్నారు. ఇకపోతే రాజ్ తరుణ్ కి దిల్ రాజుకి ఏ విభేదాలు లేవని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కొన్ని సినిమాల ఒప్పందం కారణంగా ఇప్పటి వరకు దిల్ రాజు బ్యానర్ లో రాజ్ తరుణ్ సినిమాలు చెయ్యలేకపోయాడని చెబుతున్నారు.