కొత్త టాలెంట్‌ను, వైవిధ్యాన్ని చూపించడంలో నాగార్జున ముందుంటాడు. ఆయన ఈమధ్య 'మనం, సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి' చిత్రాలతో దానిని చేతల్లో చూపిస్తున్నాడు. 'మనం' స్టోరీ, డైరెక్టర్ ఎంపిక, 'సోగ్గాడే చిన్నినాయనా'కు కళ్యాణ్‌కృష్ణ అనే నూతన దర్శకుడిని నమ్మడం నుంచి 'ఊపిరి'లో వంశీపైడిపల్లి దర్శకత్వంలో కార్తితో కలిసి అందునా వీల్‌చైర్‌కే పరిమితమైన పాత్రను చేయడం వంటివి వీటికి తాజా ఉదాహరణలు.
కాగా గత కొంతకాలంగా నాగార్జున యువ హీరో నిఖిల్‌తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రం చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. చందు మొండేటి దర్శకత్వంలో ఆయన ఈ చిత్రం చేయనున్నాడని కూడా అన్నారు. తాజా సమాచారం ప్రకారం నాగార్జున, తాజాగా నేచురల్ స్టార్‌గా ఎదిగిన నానితో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రం చేయనున్నాడట. ఇందుకు సంబంధించిన కథా చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. ప్రస్తుతం ఓ టాలెంట్‌డ్ దర్శకుడు ఫుల్ బైండెడ్ స్క్రిప్ట్ బిజీలో ఉన్నాడట. ఇక నాని కూడా వరుస చిత్రాలతో బిజి బిజీగా ఉన్నాడు.
నాగార్జున 'రాజుగారి గది2'లో నటిస్తూ, నాగచైతన్యతో 'రారండోయ్ వేడుక చూద్దాం' రిలీజ్ పనులు చూసుకుంటూ, అఖిల్‌తో విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రెండో చిత్రం నిర్మిస్తున్నాడు. ఆ తర్వాత నాగచైతన్య -సమంతల పెళ్లితో బిజీ కానున్నాడు. దాంతో ఈ చిత్రం వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం అవుతుందంటున్నారు. నాగ్ కానీ దిల్‌రాజుగానీ ఈ చిత్రం నిర్మించే అవకాశం ఉంది. నాగ్-నిఖిల్ అంటే మల్టీస్టారర్ అనలేం గానీ నాగ్ -నాని అంటే అదో సెన్సేషన్ అనడంలో సందేహం లేదు.