కాంగ్రెస్‌లో సీనియర్ నాయకుడు, ట్రబుల్ షూటర్‌గా పేరున్న ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉన్నాడు అంటే ఆయన దేశ మొదటి పౌరుడు. ఆయన యూపీఏ హయాంలో ఆ పదవికి ఎన్నికయి ఉండవచ్చు. అంత మాత్రాన రాష్ట్రపతి పదవికి మచ్చ తెచ్చేలా ఆయన రాజకీయ వ్యాఖ్యలు చేయరాదు. తాజాగా ఆయన మాట్లాడుతూ, తాను ఇంతవరకు ఇందిరా గాంధీ వంటి ప్రధానిని చూడలేదని, కాంగ్రెస్ విడిపోయిన తర్వాత కూడా ఆమె అధికారంలోకి వచ్చిన తీరు, ఆమె వేగంగా నిర్ణయాలు తీసుకునే విధానం గుర్తు తెచ్చుకుంటే అలాంటి ప్రధాని ఇక రారేమో అన్నారు.
ఆయన ఉద్దేశ్యం అదే అయి ఉండవచ్చు. ఆయనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది ఇందిరానే కావచ్చు.కానీ రాష్ట్రపతి హోదాలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అంతగా తన మనోభావాలు చెప్పాలనుకుంటే రాష్ట్ర పతి పదవి ముగిసిన తర్వాత అలాంటి వ్యాఖ్యలు చేయడమో లేక తన సొంత బయోపిక్‌ను రాసుకోవడమో..? సినిమాగా తీయడమో చేయాలి.
కానీ ఆయన ఇప్పటికీ రాష్ట్రపతిగానే ఉన్నాడు. ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా లాల్‌బహదూర్‌శాస్త్రి, మొరార్జీదేశాయ్, పివి నరసింహారావు, వాజ్‌పేయ్ వారి నుంచి మోదీ వరకు అందరినీ కించపరిచినట్లే అవుతుంది. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమైనా సరే.. ఆయన తన పదవి కాలం మరో నెలలో ముగుస్తున్నందు వల్ల మౌనంగా ఉండి ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.