మూవీ మొఘల్ రామోజీరావు కూడా తన ఈటీవీ టీఆర్పీ రేటింగ్స్‌ని పెంచుకోవడానికి మల్లెమాల టీవీ వారితో కలిసి 'జబర్దస్త్' వంటి కార్యక్రమాలను ప్రసారం చేయాల్సిన దుస్థితి ఉందా? అని చాలా రోజులుగా చర్చ సాగుతోంది. కానీ రామోజీరావు కూడా మాటకు కట్టుబడి ఉండే వ్యక్తేమీ కాదు. ఆయనేం దేవుడు కాదు...! ఆయన మొదట్లో తన ఈనాడు దినపత్రికలో గ్రహఫలాలను రాయకూడదని, మూఢవిశ్వాసాలను పెంచకూడదని నిర్ణయించాడు. కానీ పాఠకుల్లో వాటి పట్ల ఉన్న ఆసక్తిని చూసి వాటిని తన పత్రికలో కూడా మొదలుపెట్టాడు. ఇక రామోజీని కేవలం మీడియా మొఘల్‌గా అయితే ఒప్పుకుంటాం కానీ ఆయన ఏది చేపడితే దానికి తిరుగే ఉండదనే వాటితో చాలా మంది ఆయన్ను ఎరిగిన వారు ఏకీభవించరు.
ఆయన తీసిన సినిమాలలో మంచి చిత్రాలను, లాభాలు తెచ్చిన చిత్రాలను వేళ్లపై లెక్కించవచ్చు. 'మెకానిక్ మావయ్య, ఆకాశవీధిలో... ' వంటివి చూస్తే ఆయన జడ్జిమెంట్‌ను ఎవ్వరూ తప్పుపట్టకుండా ఉండలేరు. నిర్మాతగా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక ఈనాడు సమయంలోనే న్యూస్‌టుడే అనే ఆంగ్ల దినపత్రికను 'దక్కన్ క్రానికల్'కు పోటీగా పెట్టాడు. అది మూతపడింది. ఇక సితార, చతుర, విపులతో పాటు రస్నావంటి డ్రింక్స్, పచ్చళ్ల వ్యాపారం, హోటళ్ల వ్యాపారం, స్టూడియో, చిట్‌ఫండ్స్.. ఇలా ఎన్నో చేసినా, చేస్తున్నా కూడా వీటిలో లాభాలు తెచ్చిపెట్టిన వ్యాపారాలు అతి తక్కువే.
ఇక ఈటీవీ ప్లస్‌ని ప్రారంభించి దానిలో కూడా 'జబర్దస్త్' వంటి 'పటాస్'అనే షో రన్ చేస్తున్నాడు. 'జబర్దస్త్, పటాస్' ప్రోగ్రాంలు ఆయనకు చెడ్డపేరును తెస్తున్నాయి. తాజాగా రోజా వంటి ప్రజా ప్రతినిధి, రామోజీరావు వంటి మీడియా మొఘల్, నాగబాబు వంటి వ్యక్తి, మల్లెమాల వంటి సంస్థలు ఇలాంటి బూతు కార్యక్రమాలను చేస్తుండటంపై సెన్సార్ బోర్డ్ సభ్యుడు నందనం దివాకర్ హైదరాబాద్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో కేసు వేశాడు. మరి ఈ కేసు ఏమవుతుందో ముందే అందరికీ తెలిసినా కూడా ఇలాంటి కార్యక్రమాలు చట్టబద్దమే కానీ న్యాయబద్దం కాదని, నైతికంగా కాదని తెలుసుకోవాల్సివుంది.